హాట్ గా ఆ ఎమ్మెల్సీ సీటు.. రేసులో కోదండ, జర్నలిస్టులు! కారణమిదేనా? 

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి హాట్ సీటుగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంతో పాటు ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. అయితే హైదరాబాద్ కంటే వరంగల్ స్థానంలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా.. పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా బరిలో ఉంటామని ప్రకటించారు. ప్రజా సంఘాల నేతలు కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతమిస్తున్నారు. 

 

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చెరుకు.. పలు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తీన్మార్ మల్లన్న గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. పట్టభద్రులను కలిసేందుకు, కొత్త ఓటర్ల నమోదు కోసం వేదికను కూడా సిద్ధం చేసింది మల్లన్న టీమ్. ఇప్పటికే  సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు మీడియాలో యాంకర్ గా చాలా కాలం పని చేసిన రాణి రుద్రమాదేవి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం యువ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. టీ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానానికి  పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆయన సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. టీవీ9లో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వీరిలో ఎంతమంది చివరి వరకు పోటీలో ఉంటారన్నది మాత్రం తెలియడం లేదు. గతంలోనూ కొందరు జర్నలిస్టులు పోటీకి ముందుకు వచ్చి ..చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకున్నారు. 

 

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల సీటుపైనే అందరూ ఫోకస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సీటుపైనే ఎందుకంత ఆసక్తి అన్న చర్చ కూడా జరుగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలపై  సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, పాలమూరు పనులను పట్టించుకోకపోవడంపై దక్షిణ తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే తేలింది. ఇక ఉస్మానియా యూనివర్శిటీ ప్రభావం ఈ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విద్యార్థి నేతలంతా ఎక్కువగా ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఉస్మానియా ఓల్ట్ విద్యార్థులు ఈ జిల్లాల్లో వేలల్లో ఉంటారు. ఈ మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉన్నారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదనే కోపంలో ఉన్నారు వారంతా. ఇవన్ని తమకు కలిసి వస్తాయని.. ఈ సీటు నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలిచే అవకాశాలుంటాయని పోటీ చేయాలనుకునే వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉంటామన్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలంతా ఉస్మానియా యూనివర్శిటీతో అనుబంధం ఉన్నవారే. దీంతో తమకు ప్రచారం ఈజీగా ఉంటుందని వారంతా ఈ సీటును ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. 

 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కూడా దక్షిణ తెలంగాణే అయినా.. ఎక్కువ ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉంటారు. సిటీలో ఉన్నవారికి సాగు నీటి ప్రాజెక్టులు, వాటాలో అన్యాయం వంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోరు. ఈ సీటు పరిధిలో ఉద్యోగస్తులే ఎక్కువగా ఉంటారు. ఎన్నికల్లో వారు  ఏ స్టాండ్ తీసుకుంటారో ఊహించడం కష్టం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూనే.. అధికార పార్టీకు  సపోర్ట్ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్సీ ఓటర్లను గుర్తించడం కష్టమనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే హైదరాబాద్ సీటులో పోటిపై పార్టీల నుంచి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.. కాని వరంగల్ మాదిరి తటస్టులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలెవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు.  

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జర్నలిస్టులు, తటస్థులు, ప్రజా సంఘాల నేతలు  పోటీ చేస్తుండటంతో ప్రధాన పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. జర్నలిస్టుల ప్రచారంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఈ స్థానాానికి ఎమ్మెల్సీగా మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన పల్లా.. ఓటమి భయంతోనే పోటీ చేయడానికి ఇష్ట పడటం లేదని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నారు. అందుకే పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జర్నిలిస్టులు, తటస్టులు ఎక్కువ మంది పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి.