వినాశకాలే విపరీతి బుద్ది

 

వినాశకాలే విపరీత బుద్ది అని పెద్దలు అన్నారు. బహుశః కాంగ్రెస్ పార్టీకి ఇది ఇప్పుడు అక్షరాల వర్తిస్తుందేమో. ఎంతో జాగ్రత్తగా, శాస్త్రీయంగా చేయవలసిన సంక్లిష్టమయిన రాష్ట్ర విభజనను కేవలం రాజకీయ కోణం లోంచి మాత్రమే చూస్తూ పరిష్కరించబోయి కాంగ్రెస్ పార్టీ తన చేతులు కాల్చుకొంటోంది. పనిలోపనిగా రాష్ట్ర ప్రజల చేతులు, కాళ్ళే కాదు అనేక నిండు ప్రాణాలు కూడా బలిగొంటోంది.

 

ఇక నేడో రేపో ఏపీ యన్జీవోలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమ్మెను విరమించక మానరనే దైర్యంతో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏడుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కాంగ్రెస్ అధిష్టానం, ప్రకటించేసింది. కానీ ఇప్పుడు ఉద్యోగులు సమ్మెను విరమించక పోగా వారికి విద్యుత్ ఉద్యోగులు తాజాగా ఎక్సైజ్ ఉద్యోగులు కూడా తోడవడంతో రాష్ట్రంలో పరిస్థితులు నానాటికి విషమించడం మొదలయ్యాయి.

 

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే సీమంధ్ర జిల్లాలో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోగా, విద్యుత్ సంక్షోభం కారణంగా అనేక రైళ్ళు రద్దవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ సంక్షోభం కేవలం సీమాంధ్ర ప్రాంతంలోనే గాక క్రమంగా తెలంగాణా జిల్లాలకి, దక్షిణాది రాష్ట్రాలకి కూడా విస్తరిస్తోంది. దీనితో ఆందోళన చెందుతున్న టీ-నేతలు మరియు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు వెంటనే నష్ట నివారణా చర్యలు చెప్పట్టాలని కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

 

సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ యన్జీవోల చర్చలు విఫలం అయిన తరువాత వారు తమ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానంలో కలవరం మొదలయింది.

 

ఒకవైపు డిల్లీలో చంద్రబాబు వల్ల రాజకీయంగా నష్టబోయే ప్రమాదం, మరో వైపు యావత్ దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉండటంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేప్పటింది. అయితే ఉద్యోగులతో నేరుగా చర్చలకు దిగితే అది తెలంగాణా నేతలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది గనుక, ఏ.ఐ.సీ.సీ. ప్రతినిధి పీసీ చాకో ఒకవైపు కాంగ్రెస్ సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించి దారికి తేవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచిస్తూనే, తెలంగాణా రాష్ట్రం ఎన్నికల ముందు ఏర్పడుతుందో లేకపోతే ఆ తరువాత ఏర్పడుతుందో చెప్పలేమని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీకి పెట్టిన ఆరు వారాల గడువుని తొలగించామని, ఆ కమిటీ ఈ అంశంపై అనేక మందితో విస్తృత చర్చలు జరుపవలసి ఉన్నందునే నిర్దిష్ట గడువు పెట్టలేదని చెప్పుకొచ్చారు.

 

తద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన నాన్పుడు ధోరణి అవలంభించేందుకు సిద్దమవుతున్నట్లుంది. దీనితో తెలంగాణాలో పెద్ద ఎత్తున నిరసనలు, రాజకీయ నేతల ఖండనలు మొదలవగానే మళ్ళీ ఏ దిగ్విజయ్ సింగో, షిండేయో మీడియా ముందుకు వచ్చి తెలంగాణా పై వెనకడుగు వేసే ప్రసక్తేలేదని పునరుద్ఘాటిస్తారేమో!

 

ఇంతవరకు కేవలం సీమాంధ్ర ప్రాంతంలోనే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని భావిస్తున్నప్పటికీ, నిన్న ఆపార్టీ ప్రతినిధి పీసీ చాకో చేసిన ప్రకటనతో తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకు పోయేలా ఉంది.