జర్నలిస్ట్ కుటుంబానికి రక్షణ! టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులో హైకోర్టు
Published on: Tue Dec 29, 2020 2:23PM
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం హైకోర్టు విచారించింది. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో జర్నలిస్టు సంతోష్ నాయక్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఎలాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరగా కష్టడీలోకి తీసుకొని విచారణ చేయకపోతే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రాముఖ్యతను తగ్గించిన వాళ్ళం అవుతామని కోర్టుకు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
అయితే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే మరోసారి కోర్టుకు పిటిషనర్ రావొచ్చని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌కు ప్రాణ హాని ఉందని, దీంతో అతని, అతని కుటుంబం సభ్యులకు పోలుసులు రక్షణ కల్పించాలి అని హైకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణ హానీ ఉందని భావిస్తే డీఎస్పీకి దరఖాస్తు పెట్టుకోవాలని జర్నలిస్ట్ సంతోష్ నాయక్ కు సూచించింన హైకోర్టు.. పోలీసులు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


