సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. దాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు వాదనలు విన్నది. 

సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం అన్ని అవసరాలకు సరిపోవట్లేదని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. 

వాదనలను విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.