ఆన్ లైన్ క్లాసుల పై ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందా.. తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న 

కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. గత మార్చ్ లో లాక్ డౌన్ తో మూసి వేసిన స్కూళ్లు, కాలేజీలు ఇప్పటికీ తెరుచుకోలేదు. అసలు ఎప్పటికి తెరుచుకుంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతా సవ్యంగా ఉంటే ఇప్పటికే స్కూళ్లు తెరిచేవారు. ఐతే ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా చిన్న చిన్న పిల్లలకు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లలో పాఠాలు చెబుతున్నారు. ఇపుడు దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులను నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. అంతే కాకుండా ఆన్ లైన్ త‌ర‌గ‌తుల వ‌ల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని పిటిష‌న‌ర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం ల్యాప్ టాప్స్, ఫోన్స్ కొనే ఆర్థిక స్థోమ‌త అంద‌రికీ ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించింది.

విచారణకు హాజరైన ప్ర‌భుత్వ న్యాయ‌వాది ఆన్ లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న పాఠ‌శాల‌ల‌పై డీఈవోలు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని కోర్టుకు తెలిపారు. ఐతే దీని తో సంతృప్తి చెందని కోర్టు అసలు ఆన్‌లైన్ క్లాసుల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలిసీని రూపొందించలేదని, ఎల్లుండి లోగా దీని పై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.