టాస్ తో గెలిచారు..ప్రచారంతో ఓడిపోయారు

 

తెలంగాణలో నిన్న తొలి విడత పంచాయితీ ఎన్నికలు జరిగినది విదితమే. కాగా ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ చోట ఇద్దరికీ సామాన ఓట్లు రాగా టాస్ వేసి గెలుపును నిర్ణయించారు. మరో చోట వాళ్ళ ప్రచారమే వాళ్ళ ఓటమికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.... నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పులతండాలో టాస్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. కాంగ్రెస్‌, తెరాస బలపర్చిన సర్పంచి అభ్యర్థులు జర్పుల చిన్నగోరి, జర్పుల నిర్మలకు 169 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు టాస్‌ వేయగా నిర్మలను విజయం వరించింది.

మరోచోట యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురంలో సర్పంచ్ అభ్యర్థి ఆగంరెడ్డి, ఆయన భార్య ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై.. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడమే మర్చిపోయారు. చివరకు ప్రత్యర్థిగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఒకే ఓటుతో గెలవడంతో షాక్‌కు గురయ్యారు. గెలిచిన ప్రభాకర్‌రెడ్డికి 227 ఓట్లు వస్తే... ఓడిపోయిన ఆగంరెడ్డికి 226 ఓట్లు వచ్చాయి. ఎంత ప్రచారం చేసినా తీరా వాళ్లను వారే ఓడించుకున్నారు. దీన్నిబట్టి ఎన్నికల్లో ప్రచారమే కాదు.. ఓట్లు వేయించడం.. తను కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం అనేది బోధపడింది.