TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైద్యశాఖ నివేదిక కోరిన సీఎం.. సంక్రాంతికి ముందే ఆంక్షలు?

Published on: Sat Jan 8, 2022 1:17PM

దేశంలో కొవిడ్ కేసులు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్షన్నర వరకు కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వారం రోజుల్లోనే కొవిడ్ కొత్త కేసుల నాలుగు రెట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసరవచ్చని అంచనా వేస్తున్నారు. 

తెలంగాణలో కొవిడ్ విజృంభిస్తోంది. వారం రోజుల కిందట రోజు 2 వందల కేసులు వస్తే.. ప్రస్తుతం రెండు వేల ఐదు వందలకు దగ్గరలో ఉన్నాయి. గత నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో అధికారుల నుంచి సీఎం కేసీఆర్ నివేదిక కోరారు. కరోనా తీవ్రత, నియంత్రణపై శనివారం కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవని.. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. అలాగే బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. శనివారం నుంచి ఈనెల 16వరకు అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. అయితే సెలవులను నెలాఖరు వరకు పోడిగిస్తారని చెబుతున్నారు. సినిమా థియేటర్లను పూర్తిగా మూసివేయడం కాని లేదంటే సగం మందితో అనుమతి ఇవ్వడం కాని చేయవచ్చంటున్నారు. బార్లు, పబ్బులను క్లోజ్ చేస్తారని తెలుస్తోంది.