సమగ్ర కుటుంబ సర్వే ఉపసంహరణ

 

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేని పోలవరం ముంపు మండలాలలో ఉపసంహరించారు. ఖమ్మం జిల్లాలోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూను, భద్రాచలం (భద్రాచలం పట్టణం మినహా) మండలాలలో కూడా సమగ్ర కుటుంబ సర్వే జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో అక్కడి ప్రజల్లో అయోమయం నెలకొంది. తాము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాళ్ళమా, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళమా అనే అయోమయంలో పడిపోయారు. అయితే ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో ఈ ప్రాంతాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దాంతో తమ తప్పు తెలుసుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ మండలాలలో సర్వే నిర్వహించరాదని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ ఆరు మండలాలలో సర్వే ఉపసంహరించుకున్నారు.