TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు దగ్గు సిరప్‌లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

Published on: Wed Oct 8, 2025 3:15PM

 

తెలంగాణలో రెండు దగ్గు సిరప్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్‌, రెస్పిఫ్రెష్‌ టీఆర్‌ కాఫ్‌ సిరప్‌లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుల్లో కల్తీ ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో దగ్గు సిరప్‌ సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఆ నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసింది.

రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు లేదా జలుబు మందులు సూచించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా సాధ్యమైనంతవరకు సిరప్‌లను ఇవ్వవద్దని హెచ్చరించింది. ఆపై వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రం వైద్యుల సూచనతో, సరైన మోతాదు, నిర్ణీత కాలవ్యవధిలో మాత్రమే ఇవ్వాలని సూచించింది.

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా లేదా ప్రిస్క్రిప్షన్‌ లేకుండా పిల్లలకు ఏ రకమైన దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించింది.

పిల్లల విషయంలో స్వయంగా వైద్యం చేయడం ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలంటూ అధికారులు సూచించారు.