ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొదటి ప్రభుత్వం ఎవరిది, మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది తెలంగాణాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. కాంగ్రెస్ నేతలు తామే మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జైత్రయాత్రలు మొదలుబెడితే, ‘మీ హస్తంలో అధికారం పెట్టడానికేనా ఇన్నేళ్ళు మేము ఉద్యమాలు చేసేము?' అని ప్రశ్నిస్తూ తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతని, అందుకోసం మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతని కూడా తెరాసయే పుచ్చుకొంటుందని, తెరాస నేతలు తమ కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. ఈవిధంగా తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు రెండు పార్టీలు కృతనిశ్చయంతో ఉండగా, కాంగ్రెస్ పార్టీలోనే అనేకమంది నేతలు ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు.

 

వారిలో జానారెడ్డి, డీ.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్ బాబు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇంకా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంకా ఎందరో నామకనామకులు చాలా మందే ఉన్నారు. మంత్రి అరుణ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ నుండి పోటీ చేసి తమను కరుణించాలని వేడుకొన్నారు. మరి ఆయన తన విన్నపాన్నిమన్నించినా, మన్నించకపోయినా తనను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఓసారి కూర్చోనిస్తే చాలని ఆమె చిరు కోరిక.

 

ఇక తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తను కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ కాదు ఏకంగా దుప్పటే వేసేసానని ప్రకటించేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నఅవినాబావ సంబంధం గురించి మరిచిపోయిన ఆయన, అవినీతి రహితమయిన ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీయే మొట్టమొదట ప్రభుత్వం ఏర్పరచవలసిన ఆగత్యం ఉందని ఆయన అన్నారు. ‘కనీసం మరో పదేళ్ళపాటు (?) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం చాలా ఉందని' ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ  విషయంలో అందరూ ఆయనను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక కుంభకోణం కప్పెట్టేలోగా మరోకటి బయటపడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకి కేరాఫ్ ఎడ్రెస్ గా మారిపోయిన ఈ తరుణంలో కూడా ఏకంగా ‘పదేళ్ళ పాటు అవినీతి రహిత ప్రభుత్వం’ ఏర్పాటు చేయడమంటే మాటలా? అయినా కూడా పాపం పాల్వాయి అందుకు తెగించి మరీ హామీ ఇస్తున్నారంటే, అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా జనాలు మాత్రం ఆయన దైర్యానికి తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే.

 

తెలంగాణా ప్రజల పాలిట దుర్గామాతవంటి సోనియా గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న తను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్దిపదంలో తీసుకుపోతానని ఆయన హామీ కూడా ఇచ్చారు. మరి ఆయన అంత గట్టిగా 10సం.ల వరకు ( అక్షరాల పదేళ్ళవరకు మాత్రమే) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గ్యారంటీ ఇస్తున్నపుడు, ఆ పెద్దాయన మాట మన్నించి మిగిలిన వారు రేసు లోంచి తప్పుకొంటారనే నమ్మకం మాత్రం లేదు. అందుకే ‘ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు’ అని ప్రజలు వారందరికీ ఓ దణ్ణం పెట్టి వారిలో ఎవరికో ఒకరికి ఒటేయక తప్పదు మరి.

సీమంద్రాలో కూడా ఈ స్టోరీ సేమ్ టు సేమ్.