TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు జిల్లాల్లో వందల కోళ్లు మృతి! తెలంగాణలో బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం

Published on: Fri Jan 8, 2021 10:13AM

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వందల సంఖ్యలో కోళ్ల మృతి రెండు జిల్లాల్లో కలకలం రేపుతోంది. బర్డ్‌ఫ్లూ భయంతో స్థానికులు  బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో 120 నాటు కోళ్లు మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ ప్రాంతానికి చెందిన  గద్ద సారయ్య అనే వ్య‌క్తి నాటు కోళ్ల పెంప‌కం, అమ్మ‌కం వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఉన్న‌ట్టుండి రెండు రోజుల వ్యవధిలోనే 120 కోళ్లు మృతి చెందాయి. కోళ్లు మృతి చెందాయ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న మండల పశువైద్యాధికారి మాలతి వాటిని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల‌ నమూనాలను పరీక్షల‌ నిమిత్తం మొద‌ట‌ వరంగల్‌ ప్రాంతీయ పశు వైద్యశాలకు పంపారు. అనంత‌రం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో  కోళ్లు చనిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  

 పెద్దపల్లి జిల్లా ఓదెలలో వారం రోజుల నుంచి 300 నాటు, బ్రాయిలర్‌ కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటిని ఎస్సారెస్పీ డీ-86 కాలువలో పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది.మృతి చెందిన వాటిని కాల్వలో, రోడ్డు పక్కన పడేయడం మరింత భయాందోళనలకు గురి చేసింది. బర్డ్‌ఫ్లూ సోకిందనే అనుమానంతో స్థానికులు వణికిపోతున్నారు. వారం రోజుల్లో రోజుకు తనవి 4-5 కోళ్లు చనిపోతున్నాయని రామినేని రాజవీర్‌  చెప్పారు. ప్రతిరోజు ఏదోక వీధిలో పదుల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని.. ఈ విషయం పశుసంవర్థక శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ చేయించకపోవడం, వాతావరణంలో మార్పుల వల్ల కోళ్లు చనిపోతాయన్నారు మండల పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ కుమారస్వామి. వైరస్‌లు సోకకుండా ఆర్‌డీ వ్యాక్సిన్‌, గంబోరా రాకుండా ఐబీడీ వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనబడలేదని  చెప్పారు.