రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. పలు పార్టీ నేతల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై గత కొద్దిరోజుల నుండి అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు రైతు రుణమాఫీలు అన్నీ ఒకే దఫా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ రోజు బంద్ ను నిర్వహించాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల బంద్ కొనసాగుతుంది. దీంతో పలు డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. కొన్నిచోట్ల నిరసన కారులు తెల్లవారుజామునుంచే డిపోల వద్దకు చేరుకొని బస్సులను కదలకుండా ఆపేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నగరంలో పలుచోట్ల బంద్ నిర్వహిస్తున్న పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణను.. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను..  అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.