TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దశాబ్దకాల నేర చరిత్ర కలిగిన కేటుగాడి అరెస్టు

Published on: Fri Jun 12, 2026 8:58PM

 

నెలల తరబడి నిఘా తర్వాత మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని ఛేదించిన ఈగల్ ఫోర్స్..

తెలంగాణ ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మెఫెడ్రోన్ (ఎండీ) తయారీ కేంద్రాన్ని ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్‌తో పాటు మరో రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ తయారీ పరికరాలు, రసాయనాలు, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరికి దశాబ్దకాల నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2015 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ తయారీ, రవాణా కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గతంలో హత్య, కిడ్నాప్, దోపిడీ, మాదకద్రవ్యాల తయారీ కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడు.

జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన మత్స్యగిరి, నిమ్మల నరేష్ సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలోని ఓ మామిడి తోటలో నకిలీ పరిశ్రమ పేరుతో మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఐదు రోజుల పాటు డ్రగ్స్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నెలల తరబడి నిందితుల కదలికలపై నిఘా ఉంచిన ఈగల్ ఫోర్స్, జూన్ 10-11 తేదీల మధ్య రాత్రి డ్రగ్స్‌ను తరలిస్తున్న సమయంలో వారిని పట్టుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.