సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు! రెచ్చగొట్టే పోస్టులు వద్దన్న డీజీపీ 

జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. 

 

తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్‌‌ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. 

 

గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని డీజీపీ తెలిపారు.ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.