పదిమంది సీనియర్ నేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్.!!

 

ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో తెరాసను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీడీపీ, టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు ఇలా అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరిపి.. ఆచితూచి అడుగులు వేసి.. పార్టీలు సంతృప్తి చెందేలా సీట్ల లెక్క తేల్చింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనూ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గాల్లో రిపోర్ట్ లు తెప్పించుకొని, ముఖ్య నేతలతో చర్చింది అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా చేస్తుంది. అయితే అభ్యర్థులను ప్రకటించిన తరువాత తెరాసలో లాగా అసంతృప్తి సెగ తగలకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త చర్యలు చేపట్టింది.

తెరాసలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తి సెగ ఎంతలా తగిలిందో తెలిసిందే. పలు సీనియర్ నేతలు పార్టీని వీడారు.. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జానారెడ్డి, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి ఇలా సుమారు పదిమంది ముఖ్య నేతలను రంగంలోకి దింపనుందట. వీరికి ఒక్కొక్కరికి 10 నుంచి 15 నియోజకవర్గాలు అప్పగిస్తారు. అభ్యర్థుల ప్రకటన జరిగిన వెంటనే ఈ నేతలు ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడతారు. టిక్కెట్లు రాలేద‌ని బాధ‌ప‌డొద్ద‌ని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వుల‌లో ప్రాధాన్య‌త కల్పిస్తామ‌ని, ఇత‌ర మార్గాల ద్వారా కూడా పార్టీ నుంచి మేలు జ‌రుగుతుంద‌ని బుజ్జ‌గింపులు చేసి.. వారు పార్టీ మారకుండా, రెబెల్స్ గా పోటీచేయకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారన్నమాట. చూద్దాం మరి కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో.