జేపీ వైఎస్సార్ కోవర్ట్ ! గోనె సంచలన కామెంట్స్
Published on: Sat Feb 13, 2021 1:13PM
శ్రీరంగ నీతులు ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ వాస్తవంలో మాత్రం అవి ఆచరణ సాధ్యం కావని తాజాగా వెలుగు చూసిన ఒక సంచలన విషయం స్పష్టం చేస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ ఎంతో నిజాయితీపరుడని ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరని పేరుంది. అయన లోక్ సత్తా పార్టీ మొదలు పెట్టి రాజకీయాలలో ప్రవేశించినపుడు ఈ కుళ్ళు రాజకీయాలలో అయన ఇమడలేరని ప్రజలు భావించారు. 2009 లో మొట్టమొదటి సారి జేపీ కూకట్ పల్లి నుండి పోటీ చేసినపుడు అనేక మంది విద్యావంతులు.. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఓట్లు వేసి ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అయితే అయన అందరూ అనుకున్నంత నిజాయితీపరుడు కాదని అయన కూడా మేడిపండు లాంటివాడేనని తాజాగా వెలుగు చూసిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు అయిన గోనె ప్రకాశరావు తాజాగా జేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి ఎపి సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జయప్రకాశ్ నారాయణకు కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. అప్పట్లో లోక్‌సత్తాను పోటీకి నిలపడం ద్వారా ప్రతిపక్ష టిడిపి ఓట్లను చీల్చడానికి వైఎస్ .. జేపీకి సొమ్ములు ఇచ్చారని గొనె ప్రకాశరావు ఒక టీవీ ఛానెల్ చర్చలో ఆరోపించారు. అయితే వాస్తవానికి అప్పట్లో జేపీ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని రూ.40లక్షలు అడిగితే ఆయన ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారని గొనె చెప్పారు. అంతేకాకుండా దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో వై.ఎస్ ప్రోత్సాహంతోనే జయప్రకాష్ నారాయణ, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎన్నికలలో అభ్యర్థులను బరిలోకి దించారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును వీరిద్దరూ చీల్చడం ద్వారా రాజశేఖర్‌రెడ్డికి మేలు చేశారని.. అప్పటి ఎన్నికల్లో గెలవాల్సిన టిడిపి ఓడిపోయిందని గోనె తన విశ్లేషణలో పేర్కొన్నారు.
అప్పటి ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థుల్లో జేపీ తప్ప ఎవరూ గెలవకపోయినా.. ప్రతి నియాజకవర్గంలో ఆ పార్టీకి మంచి ఓట్లే వచ్చాయి. అప్పట్లో జయప్రకాష్‌నారాయణ కు ఉన్న మంచిపేరు తో ఆయన పార్టీ తరుపున అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా ప్రజలు మాత్రం ఓట్లు వేశారు. దీంతో దాదాపు 65 నుంచి 75 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ ఓట్లు చీల్చింది.
అప్పట్లో జేపీ, చిరంజీవి వల్లే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఓడిపోయిందనే విశ్లేషణలు వచ్చాయి. అయితే లోక్ సత్తా నేత జయప్రకాష్‌నారాయణ వై.ఎస్‌తో కుమ్మక్కు అయ్యారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే గోనె తాజాగా చేసిన వ్యాఖ్యలతో జేపీ నిజాయితీపరుడని భావించిన వారందరు ఇపుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అప్పట్లో కోటి రూపాయల కోసం ఇంతపని చేశారా.. అంటూ ఇపుడు అవాక్కు అవుతున్నారు.


