ఖైరతాబాద్ గణపతికి కేసీఆర్ పూజలు

 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణపతికి వినాయకచవితి రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో 2001 సంవత్సరంలో ఖైరతాబాద్ గణపతిని సందర్శించిన ఆయన ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గణపతిని దర్శించుకుని పూజలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించారు. గణపతి దయవల్ల తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వీరిద్దరూ వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని స్వామివారిని కోరుకున్నట్టు వీరు చెప్పారు. వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖైరతాబాద్‌ వినాయకుడి మీద పూలవర్షం కురిపించాలని నిర్వాహకులు కోరారని తప్పకుండా హెలికాఫ్టర్‌ ఏర్పాటు చేసి పూలవర్షం కురిపించే ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.