రైతులకు రుణాలు ఇకపై అందేనా?

 

అన్నదాతా సుఖీభవ అని అన్నం తిన్న ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అనే మాట.రెండేళ్లుగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకూ క్రమంగా చరమగీతంపాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ వడ్డీ లేని రుణం వడ్డీ రాయితీలను పూర్తిగా అటకెక్కించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డినీ రైతులకూ వెనక్కిస్తారు. అంటే నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వరకూ ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్టు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులలో లక్ష రూపాయల లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు. 

రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అమలుచేసింది. ఈనేపధ్యంలో మొత్తం పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఏ రైతూ గడువు లోగా చెల్లించక పోవడంతో ఎవరికి పావలా వడ్డీ లేద వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్దిలో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకూ ఆర్బీఐ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ కింద బ్యాంకు లకు నగదు జమ చేస్తూ వస్తోంది. పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణం పథకం కింద రెండు వేల పద్నాలుగు, పదిహేను ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. మే ముప్పై ఒకటి న రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు జీవో వచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా విడుదల చేయలేదు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పది వేలకు పెంచింది. ప్రతి సీజన్ కు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చినప్పుడు ఇతర పథకాల అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీ లేని రుణం పథకాన్ని నిలిపివేశారు. రుణమాఫీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటం లేదు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి కిసాన్ క్రెడిట్ కార్డులకు లింక్ పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. మూడు శాతం వడ్డీ రాయితీని రైతుల కిస్తున్న కేంద్రం బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డి రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడుల్లో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలూ బంగారం రుణం ప్రయోజనాలు అందవు. రైతన్నకు తోడుగా ఉంటూ 'జై కిసాన్' అని ప్రముఖ్యతను ఇస్తున్న రైతులకు రుణం అందుతుందో లేదో వేచి చూడాలి.