సమగ్ర సర్వే సూపర్‌హిట్: కేసీఆర్
Published on: Tue Aug 19, 2014 9:19PM
.jpg)
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వున్న తెలంగాణ ప్రజలు కూడా వచ్చి సమగ్ర సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజలు తనకు ఇలాగే సహకరిస్తే వారు కోరుకున్న బంగారు తెలంగాణను వారికి అందిస్తానని కేసీఆర్ అన్నారు. జిల్లాలలో 94 శాతం, హైదరాబాద్లో 88 శాతం సర్వే పూర్తయిందని, మొత్తమ్మీద హైదరాబాద్‌లో కోటి 20 లక్షల మంది వున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా తన కుటుంబాల పేర్లు నమోదు చేసుకోలేకపోతే, వారికి మరో అవకాశం ఇస్తారని, ఆ వివరాలు రేపు తెలియజేస్తారని చెప్పారు.


