బిగ్ ట్విస్ట్.. మహాకూటమికి టచ్ లో కేసీఆర్!!

 

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీలు మహాకూటమిగా దగ్గరవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. కానీ కొందరు నేతలు మాత్రం కేసీఆర్ బీజేపీ వైపే ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఢిల్లీలోని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్‌ తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌నూ గౌరవిస్తామన్నారు. మరి.. వారు విపక్ష కూటమిలో చేరడం లేదు కదా? అని ప్రశ్నించగా.. ‘వేచి చూడండి’ అని సమాధానమిచ్చారు.

ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడుతామని తెలిపారు. తమ నేత ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉన్నా లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వామపక్ష పార్టీలు తమతో కలిసి వస్తాయో రావో తెలియదని, ఆ పార్టీలతో మాట్లాడలేదని తెలిపారు. ‘డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ కాంగ్రెస్ తో ఉన్నాయి. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు, శరద్‌పవార్‌, ఫరూక్‌, కేజ్రీవాల్‌, నేను బుధవారం సమావేశమయ్యాం. మరిన్ని పార్టీలు రాజకీయ పరిస్థితుల మేరకు కలుస్తాయి. ఎన్నికల తర్వాత కూడా వస్తాయి’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు తెలివైనవారని, జాతీయ స్థాయిలో పొత్తులు ఉండి రాష్ట్రాల్లో లేకపోయినా బీజేపీని ఓడించడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రజలు మద్దతు ఇస్తారని అన్నారు. మోదీని, అమిత్‌ షాను ఇంటికి పంపించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.