కేసీఆర్ గోల్కొండ టూరు చూతము రారండీ...

Publish Date:Aug 5, 2014

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎప్పటిలా పెరేడ్ గ్రౌండ్స్‌లో కాకుండా గోల్కొండ కోటలో జరపాలని నిర్ణయించారు. గోల్కొండ కోట మీద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి గోల్కొండ సందర్శనకు వెళ్ళారు. జెండా ఆవిష్కరణ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గోల్కొండ టూర్ విశేషాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

 

గోల్కొండ కోట పరిసరాలన్నీ ఏనాడో కబ్జాకు గురయ్యాయి. గోల్కొండ కోట చుట్టూ కొన్ని వేల ఇళ్ళు వుంటాయి. వాటిని తొలగించడం అనేది ఎవరూ కలలో కూడా చేయలేరు. అలాంటి ప్రాంతానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వచ్చి ఆగింది. ఇలా ముఖ్యమంత్రి కాన్వాయ్ గోల్కొండ కోట దగ్గరకి రావడం ఈమధ్యకాలంలో ఇదే ప్రథమం కావడంతో స్థానికులు ఏంటా అని వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కొంతమంది జనం అయితే కేసీఆర్ కాన్వాయ్‌ చుట్టుముట్టారు. దాంతో సీఎం కేసీఆర్‌ గారికి కోపం వచ్చేసింది. ముఖ్యమంత్రి అయిన తాను వచ్చినప్పటికీ జనం అలా తమ కార్లచుట్టూ గుమిగూడటమేంటని ఆయన సెక్యూరిటీ అధికారులను గదిమారు. దాంతో సెక్యూరిటీ అధికారులు అక్కడ వున్న జనాన్ని పక్కకి నెట్టేశారు. జనంతోపాటు మీడియాని కూడా కేసీఆర్ సారు నుంచి దూరంగా పంపేశారు. జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అంతా క్లియర్ అయిన తర్వాతే కేసీఆర్ కారులోంచి కిందకి దిగారు.

 

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి గోల్కొండ సందర్శనకి వచ్చినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ అసదుద్దీన్‌కి, స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు అధికారులకు సమాచారం ఇవ్వలేదని కౌసర్ మొహియుద్దీన్ అనే ఎమ్మెల్యే కేసీఆర్ వచ్చినప్పుడే ఆందోళనకి దిగాడు. గోల్కొండ గేటుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశాడు. దాంతో పోలీసు అధికారులు ఆయన్ని గడ్డం పట్టుకుని బతిమాలి ఆందోళన నుంచి విరమింపజేశారు. కేసీఆర్ గోల్కొండకి రావడమేంటోగానీ, ఎప్పుడూ గోల్కొండని చూడటానికి వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది పడిపోయారు. ముఖ్యమంత్రి గోల్కొండను చూసే సమయంలో పర్యాటకులు ఎవరూ రాకూడదన్న ఉద్దేశంతో గోల్కొండ గేట్లు మూసేశారు. దాంతో వందలాదిమంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.

By
en-us Political News