బీజేపీతో సయోధ్యా.. సమరమా! ఆసక్తిగా మారిన కేసీఆర్ ఢిల్లీ టూర్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారింది.  దేశ రాజధానిలో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకే కేసీఆర్ వెళుతున్నారని చెబుతున్నా.. ఆయన షెడ్యూల్ పై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు కేసీఆర్. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర  మోడీని కేసీఆర్ కలవబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ సీఎంవో నుంచి పీఎం అపాయింట్ మెంట్ కోరినట్లు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని గులాబీ బాస్ ఎందుకు కలవబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర సమస్యలపైనే ప్రధానితో కేసీఆర్ మాట్లాడుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నా.. అంతర్గతంగా మరో కీలక అంశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీతో సయోధ్య కోసమే టీఆర్ఎస్ అధినేత హస్తినకు వెళుతున్నారనే వాదన వినిపిస్తోంది.   
 

2014లో అధికారం చేపట్టనప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు కేసీఆర్. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కీలక బిల్లులకు పార్లమెంట్  లో టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారు. ప్రధాని మోడీని పొగుడుతూ పలుసార్లు కేసీఆర్ ప్రకటనలు కూడా చేశారు. అయితే కొన్ని రోజులుగా కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. కేంద్రంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రతిష్టాత్మంగా చెప్పుకుంటున్న కొత్త వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. కేసీఆర్ తీరుతో కేంద్రం కూడా కౌంటర్ ప్లాన్ అమలు చేస్తోందని చెబుతున్నారు.  తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. టీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కొందరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కాషాయ కండువా కప్పేసుకున్నారు. త్వరలో మరికొంత మంది నేతలు కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

 

తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. దుబ్బాక ఓటమితో ఎదురైన షాక్ నుంచి కోలుకోకముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు పార్టీకి మరో ఝలక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు కేసీఆర్ సర్కార్ త్వరలో కూలిపోవడం ఖాయమని ప్రకటనలు ఇస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ అవినీతిని బయటికి తీస్తామని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలో  కేంద్రం చర్యలు మొదలు పెట్టిందని  చెబుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ గత  ఆరేండ్లలో జరిగిన అవినీతిపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంతో పాటు టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపైనా కేంద్రం ఫోకస్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆస్తుల పెరుగుదలకు సంబంధించి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఐటీ నోటీసులు వచ్చాయంటున్నారు. 

 

కేంద్ర నిఘా సంస్థల దూకుడు, ఐటీ నోటీసులతో కారు పార్టీ నేతలు కలవర పడుతున్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ అవినీతిని ప్రస్తావించారు. దీంతో తెలంగాణలో ఏదో జరగబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతగా మారింది. బీజేపీతో సయోధ్య చేసుకోవడానికే కేసీఆర్ ప్రధాని మోడీని కలవనున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాము కేంద్రానికి సపోర్టుగానే ఉంటామని, రాష్ట్రంలో తమను డిస్ట్రబ్ చేయవద్దని ప్రధానిని కేసీఆర్ కోరవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం అయినందున బీజేపీకి వచ్చే నష్టమేమి లేదని కాషాయ పెద్దలకు కేసీఆర్ వివరించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. 

 

ఇక్కడ మరో అంశం కూడా ఉంది. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గతంలో మంత్రులే హస్తినకు వెళ్లి కేంద్రమంత్రులను కలిసేవారు. అవసరమైతే కేటీఆర్,  హరీష్ లు వెళ్లేవారు. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాకా.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను కేటీఆరే పర్యవేక్షిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత కేసీఆర్ ఎక్కువగా బయటికే రావడం లేదు. ఇప్పుడు ఢిల్లీలో కరోనా సేకండ్ వేవ్ ఉంది. కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. అయినా కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారంటే ఆయన అజెండాలో  చాలా సీరియస్ అంశాలే ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  బీజేపీని మచ్చిక చేసుకోవడమే కేసీఆర్ పర్యటనలో ప్రధాన అంశంగా ఉండవచ్చని కూడా చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ పర్యటన తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తిగా మారింది.