దక్షిణాది కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కేసీఆర్

 

దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే సదరన్ జోనల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికయ్యారు. ఆయన్ని ఈ పదవికి ఎంపిక చేస్తూ కేంద్ర హోంమంత్రి నుంచి అధికారికంగా లేఖ అందింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌కి కేంద్ర హోంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని ఉపాధ్యక్ష పదవిలో కేసీఆర్ ఒక సంవత్సరం పాటు వుంటారు. గతంలో దక్షిణాది నుంచి జోనల్ వైస్ ఛైర్మన్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించారు. ఈ అవకాశం ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరి, తెలంగాణ సదరన్ జోనల్ కౌన్సిల్‌లో సభ్యులుగా వుంటాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, జాతీయ సమగ్రత, కేంద్ర పథకాల అమలు, అభివృద్ధిపై రాష్ట్రాల ఆలోచనలను కేంద్రానికి తెలియజేయడం వంటి అంశాలు కౌన్సిల్ పరిధిలో చర్చిస్తారు.