TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ కేబినెట్ విస్తరణ... మరో వాయిదా?

Published on: Fri May 30, 2025 4:27PM

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది.   తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది.  రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి  స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.  పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ.. మళ్లీ ముహూర్తం ముడిపడలేదనీ, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదనీ హస్తిన వర్గాలు అంటున్నాయి.  గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దైప సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడటంతో అసలేం జరుగుతోంది? అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావహులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. ఇందు కోసం దాదాపు మూడు రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరో సారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్ఠానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం (జూన్ 30) హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే.. చావు కబురు చల్లగా అన్నట్లు హైకమాండ్ ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది.

అదే విధంగా పీసీసీ కార్యవర్గం విషయంలో కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ముఖ్యంగా మంతివర్గ విస్తరణలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైక మాండ్ యోచనగా చెబుతున్నారు.   ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రిపదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.