ప్రజల నడ్డి విరిచే అంకెల గారడీ బ‌డ్జెట్‌!

 

బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు.

ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది.

గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది?

ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది.

మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు.

రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.