హెచ్చరికలకు పోవద్దు.. మెక్కిందంతా కక్కిస్తాం.. కేటీఆర్ కు లక్ష్మణ్ వార్నింగ్

 

 

తెలంగాణ లో బలపడి అధికారం చేపట్టాలని బీజేపీ డిసైడ్ ఐన దగ్గర నుండి బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా రాష్ట్రం లోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుపడుతోందని, అలాగే మిషన్  కాకతీయ, కమిషన్ల మిషన్ గ మారిందని తీవ్ర విమర్శలు చేసారు. దీని పై స్పందించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్ణాటక తరహా రాజకీయాలు తెలంగాణాలో చెల్లవని అవినీతి ఉంటే నిరూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. అలాగే బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐతే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే హెచ్చరికలకు పోవద్దని త్వరలోనే మెక్కింది అంతా కక్కిస్తామంటూ కేటీఆర్ ను హెచ్చరించారు. రెండోసారి అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని అయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం అవినీతిమయంగా మారిపోయిందంటూ లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల్లో  ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదంటూ మండిపడ్డారు. రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు రుణమాఫీ వంటి పథకాలు పూర్తిగా పడకేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయి నాలుగు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భవ పథకం గొప్పదేం కాదంటూ వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలని బీజేపీ నేత నిలదీశారు. రూ.30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచేశారని అయన ఆరోపించారు. 6శాతం కమీషన్ల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారంటూ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు.