రాజా సింగ్ ఔట్! తెలంగాణ బీజేపీ క్లీన్ బౌల్డ్!

మూలిగే నక్కపై తాటిపండు సామెత మనకైతే బాగా తెలుసు! మరి తెలంగాణ బీజేపీకి? వారికి కూడా బాగానే అనుభవమై వుండాలి! అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ మరీ దారుణంగా దశా-దిశ లేకుండా ప్రయాణిస్తోంది అంటే… అది తెలంగాణ కమలదళమే! ఎందుకంటే, ఇక్కడ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, మరోవైపు ముస్లిమ్ ఓటర్లనే నమ్ముకుని రాజకీయం చేసే ఓవైసీలు వున్న ఎంఐఎం… ఈ రెండూ బీజేపీకి కలిసి వచ్చే అంశాలే! అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా… కాదంటే, రోజు రోజుకి మరింత తీసికట్టుగా సాగుతోంది కాషాయ నేతల ప్రయాణం! ఇందుకు తాజా ఉదాహరణ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా! దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరణ గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా వుంటుందో అక్కడికి కమలదళం ఈజీగా జొరబడుతుంది. దిల్లీలో కూర్చున్న రాహుల్ తేరుకుని ఇటు వచ్చేలోపు అమిత్ షా వలసలు ప్రొత్సహించి కాంగ్రెస్ ను ఖాళీ చేస్తుంటారు. అసోమ్ నుంచీ గోవా దాకా అంతటా ఇదే ఫార్ములా. కానీ, తెలంగాణలో మాత్రం టీ కాంగ్రెస్ ను అమిత్ షా ఒక్కసారి కూడా దెబ్బకొట్టలేదు. ఇక టీఆర్ఎస్ ను ఢీకొట్టడం ఎలా సాద్యం? అయినా కూడా తెలంగాణ కాషాయ నేతలు భారీగా చేరికలుంటాయని అప్పుడప్పుడూ రొటీన్ గా చెబుతూనే వుంటారు! చేరికల మాట అటుంచితే అసలు వున్న అయిదుగురిలో ఓ ఎమ్మెల్యే చేజారిపోయాడు టీ బీజేపీకి! అతనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్!

 

 

రాజా సింగ్ ఓవైసీల ఇలాఖా లాంటి ఓల్డ్ సిటీలో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. అయితే, ఆయనకు ఓవైసీల ఎంఐఎంతో వున్న విభేదాల కంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో వున్న మనస్పర్థలే ఎక్కువ! కారణాలు ఏంటో బయటకి పెద్దగా తెలియకపోయినా ఆయనని గతంలో కిషన్ రెడ్డిగానీ, ఇప్పుడు లక్ష్మణ్ గానీ పెద్దగా ప్రొత్సహించింది లేదు. అమిత్ షా సైతం అయనని గమనించారా అంటే అనుమానమే! ఇటువంటి పరిస్థితిలో రాజా సింగ్ బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేశారు. పూర్తి స్థాయిలో గో సంరక్షణ ఉద్యమం చేస్తానంటూ ప్రకటించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దని రాజీనామాలు చేశానని కూడా చెప్పారు! ఇంతకీ ఇందులోని పొలిటికల్ మెసేజ్ ఏంటి?

 

 

పాతబస్తీలో ముస్లిమ్ ఓట్లపై ఆధారపడే ఎంఐఎం చాలా బలమైన పార్టీ. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఎవ్వరూ పెట్టుకోరు. రాజకీయంగా మచ్చిక చేసుకునే ప్రయత్నాలే చేస్తారు. కానీ, రాజా సింగ్ లోకల్ కాబట్టి అక్కడే వుంటూ ఎంఐఎంని ప్రత్యక్షంగా ఎదుర్కుంటూ వస్తున్నారు. నిజానికి హిందూత్వ పార్టీ అయిన బీజేపీ ఆయనని అద్భుతంగా వాడుకోవచ్చు. ఉత్తరాదిలో ఇలాంటి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లు బోలెడు మంది వుంటారు కమలదళానికి! కానీ, ఇక్కడ వున్న ఒక్కర్నీ కూడా పట్టించుకోకుండా జారవిడుచుకుంది! దీనికి కారణాలు ఏమైనా నష్టం మాత్రం తప్పకుండా పార్టీకే వుంటుంది. ఎందుకంటే, కొందరు చెబుతన్న దాని ప్రకారం రాజాసింగ్ నెక్ట్స్ టార్గెట్ ఎంపీ పదవట!

 

రాజా సింగ్ ఇప్పుడు గో సంరక్షణ అని చెబుతోన్నా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశాడంటున్నారు! బీజేపీలో వుంటే ఆయనకి హైద్రాబాద్ గానీ, సికింద్రాబాద్ గానీ ఎంపీ సీటుకి టికెట్ దొరకటం అసాధ్యం. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన్ని అంతగా ఎంకరేజ్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. మరిక మిగిలింది ఆయన స్వంతంగానో, మరేదైనా పార్టీ టికెట్ తోనే పోటీ చేయటం. అందుకే, ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారు రాజాసింగ్. కాకపోతే, హిందూత్వ ఓట్లు భారీగా పోగేసుకునే అవకాశం వున్న ఆయన ఎక్కడ్నుంచీ పోటీ చేసినా మొదట నష్టపోయేది కమలదళమే! గత ఎన్నికల్లో దత్తాత్రేయ గెలిచిన సికింద్రాబాద్ నియోజక వర్గంలో రాజాసింగ్ బరిలో నిలిస్తే … ఆయన గెలిచినా, ఓడినా… బీజేపీ ఓటమి మాత్రం ఖాయం! ఇక హైద్రాబాద్ ఎంపీగా అసదుద్దీన్ పై పోటీ చేసినా బీజేపీ నిలపబోయే అభ్యర్థికి గడ్డు కాలమే! ఇలా ఎటు చూసినా బీజేపీకి తెలంగాణలో దక్కబోయే ఒకటి అరా ఎంపీ సీటు కూడా రాజా సింగ్ వల్ల కొట్టుకుపోయే పరిస్థితి దాపురించింది! దీనికి టీ బీజేపీ, అమిత్ షాల వద్ద ఏం విరుగుడు వుందో… ప్రస్తుతానికైతే సస్పెన్సే!