TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేవీపీ మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ డైరెక్షన్! షర్మిల పార్టీపై బీజేపీ సంచలనం 

Published on: Tue Feb 9, 2021 4:10PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. షర్మిల పార్టీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని కొందరు చెబుతుండగా.. కేసీఆరే అంతా నడిపిస్తున్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే  షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ బీజేపీ సంచలనం వ్యాఖ్యలు చేసింది.  సీఎం కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోడానికే తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇందులో భాగమే  షర్మిల కొత్త పార్టీ ప్రకటన అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కాపాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని తెలిపారు. షర్మిల కొత్త పార్టీ ప్రకటన అనేది ముమ్మాటికీ కేసీఆర్ కనుసన్నల్లో, కేవీపీ ఆలోచనలతోనే ముందుకు వెళ్తోందని ప్రభాకర్ స్పష్టం చేశారు. 

మంత్రి కేటీఆర్ భజన పరులు పెంచిన ఒత్తిడి మూలంగానే కేసీఆర్ ఈ కొత్త సమీకరణాలకు తెరలేపారని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. మంత్రి కేటీఆర్ అనుచరుల ఒత్తిడిని తట్టుకోడానికి కేవీపీ సలహా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహకారాన్ని కేసీఆర్ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంత ప్రయత్నించినా, తెలంగాణ ప్రజానీకం మాత్రం ఆయన్ను నమ్మే స్థితిలో లేరని, కారుకు మబ్బులు కమ్ముకున్నాయని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ లో పుట్టిన ముసలాన్ని అధిగమించడానికే కేసీఆర్ కమ్యూనిస్టులను కలుపుకుంటున్నారని, కాంగ్రెస్‌కు లోపాయకారిగా మద్దతిస్తున్నారని  ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేక సార్లు ఉప ఎన్నికలకు వెళ్లారని, సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలపై ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు ఆయన సిద్ధమేనా? అని ప్రభాకర్ సవాల్ విసిరారు.