హరీష్ రావు కనిపించడం లేదు!!

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ది పదవుల కోసం రాజీపడిన చరిత్ర అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉండి.. కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారం కోసం కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం కేంద్రం ఏమి చేసిందో.. కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌రావును అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హరీష్‌రావు ఎక్కడ కనిపించడం లేదని ఎద్దేవా చేసారు. కాళేశ్వరం ప్రాజక్టుకు సహకరించిన ప్రధాని మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవటం‌ బాధాకరమని అన్నారు.
 
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల హామీలపై చర్చించకపోవటం అన్యాయమని లక్ష్మణ్ అన్నారు. నిరుద్యోగం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆర్టీసీని ఆదుకోవటానికి క్యాబినెట్‌లో కనీసం చర్చించలేదని, ఎన్నికల హామీలను అమలు చేయాలన్న ఆకాంక్ష సీఎంకి లేదని విమర్శించారు.  30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసమే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యాలయాల కోసం స్థలం కోరితే మాత్రం కేసీఆర్ స్పందించటం లేదని విమర్శించారు.

ప్రస్తుతం కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శాసనసభను మార్చటానికి తాము వ్యతిరేకమని లక్ష్మణ్ అన్నారు.