కేటీఆర్ తో కమలానికి గండమా? కేసీఆరే సంజయ్ అస్త్రమా? 

తెలంగాణలో దూకుడుగా  వెళుతోంది బీజేపీ. వరుస విజయాలు ఇచ్చిన జోష్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు  చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే ప్రకటిస్తున్నారు బండి సంజయ్.  టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని కూడా చెబుతున్నారు. పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదంటున్నారు. కేసీఆర్ పై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న సంజయ్.. ఇటీవల మాత్రం మాట మారుస్తున్నారు. కేసీఆర్ కు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పడం మానేసి.. మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారని పదేపదే చెబుతున్నారు బండి సంజయ్. దీని వెనక బలమైన వ్యూహమే ఉందని తెలుస్తోంది. 

తెలంగాణ  పాలనలో మార్పులు జరుగుతాయని, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని కొంత కాలంగా రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. దీంతో తనకు సంబంధం లేని అంశమైనా సీఎం మార్పుపై  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు  బండి సంజయ్. కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచన కేసీఆర్ కు లేదని చెబుతున్నారు. తమకు మంత్రి పదవి రాకపోతే  కొత్త పార్టీ పెడతామని ఇప్పటికే ఆ పార్టీలోని  ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని... ఈ మాటలను వారితో అనిపిస్తోంది సాక్షాత్తు కేసీఆరే అని సంచలన కామెంట్లు చేశారు సంజయ్. కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని... అందువల్ల సీఎం కావాలనే ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టాలని కేటీఆర్ కు కేసీఆర్ చెపుతారని... తద్వారా కొడుకును సీఎంని చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ వాయిదా వేస్తారని చెప్పారు. గతంలో సంతోష్ తో ఇలాంటి వ్యాఖ్యలు చేయించిన కేసీఆర్... ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఆ మాట చెప్పిస్తున్నారని అన్నారు. ఇప్పట్లో కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేయబోరని  స్పష్టం చేస్తున్నారు సంజయ్. 

తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో బండి సంజయ్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన సంజయ్.. ఇప్పుడు మరో మూడేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని చెబుతుండటం వెనక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. కేసీఆర్ సీఎంగా  పాలనపై పూర్తిగా ఫోకస్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన సచివాలయమే వెళ్లరు. ఎక్కువ సమయం ఫౌంహౌజ్ లోనే ఉంటారు. కొన్నిసార్లు వారాల తరబడి ఆయన బయటికే రాలేదు. కేసీఆర్ తీరే ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారింది. కేసీఆర్ ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అని, ప్రజలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విపక్షాలు జనంలోకి వెళుతున్నాయి. బీజేపీ కూడా ఇదే నినాదం వినిపిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారంలో కేసీఆర్ వైఖరినే ప్రధాన అస్త్రంగా మార్చుకుని మంచి ఫలితాలు సాధించింది. అందుకే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటేనే బెటరని కమలం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 కేటీఆర్ యంగ్ లీడర్. ఆయనకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పాలనలో స్పీడ్ పెరిగుతుంది. ఇప్పటివరకు సాగిన పాలనకు భిన్నంగా కేటీఆర్ వ్యవరించే అవకాశం ఉంటుంది. కేటీఆర్ జనాల్లో ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. దీంతో కేసీఆర్ పై చేసినట్లుగా కేటీఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేసే అవకాశం బీజేపీ నేతలకు ఉండకపోవచ్చు. కేంద్ర పెద్దలు కూడా కేటీఆర్ పై సానుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది. ఇలా ఏ లెక్కన చూసినా.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే కేటీఆర్ కంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే.. 2023లో అధికారం సాధించాలన్న తమ టార్గెట్ రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుందని తెలంగాణ కమలం నేతల ఆలోచనగా ఉందంటున్నారు. 
 
తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆరే మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నా... ఆయన యూటర్న్ మాటల వల్ల ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయంటున్నారు. జైలుకు పంపిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడంతో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేననే సంకేతం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని కొందరు కమలం నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళ ప్రకటనలతో కేడర్ లోనే అయోమయం నెలకొనే  పరిస్థితి వస్తుందంటున్నారు.