TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నియోజకవర్గానికో బైక్‌... తెలంగాణ బీజేపీ నయా ప్లాన్‌

Published on: Thu May 18, 2017 12:53PM

 

తెలంగాణలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది కమల దళం.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేతలు... యూపీ వ్యూహాన్ని తెలంగాణ గడ్డపై అమలు చేయబోతున్నారు. యూపీలో పార్టీని గద్దెనెక్కించిన బైక్ లను, కమలాన్ని వికసించేలా చేసిన ఫుల‌్ టైమర్లను ఇక్కడ రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే 70మందికి పైగా ఫుల్ టైమర్లను కార్యక్షేత్రంలోకి దించిన రాష్ట్ర పార్టీ... మరో 49 మందిని ఎంపిక చేసే పనిలో పడింది.  ఈనెల 22న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు రానున్నందున.. ఈలోపే అందరిని రంగంలో దించాలని భావిస్తోంది.

 

యూపీ ఎలక్షన్లకు రెండేళ్ల ముందే ఫుల్ టైమర్లను అక్కడ దింపేసిన బీజేపీ అధిష్టానం.. నియోజకవర్గాల్లో కలియతిరగడానికి వారికి టూవీలర్లు అందించింది. రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. అదే స్పీడ్ తో అధికార పీఠాన్ని అధిరోహించింది. సరిగ్గా ఇదే ప్లాన్ ను తెలంగాణలో అమలు చేయాలనుకున్న బీజేపీ...  ఆ విజయ రథాలను సెంటిమెంట్ గా ఇక్కడికి రప్పించింది.

 

నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బైక్ లను సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు. అవసరమైతే.. ఎన్నికల నాటికి మరో వంద వాహనాలను అదనంగా అందించాలని అనుకుంటున్నారు. పెద్ద నియోజకవర్గాల్లో ఇద్దరు చొప్పున ఫుల్ టైమర్లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా యూపీలో అనుసరించిన ప్రణాళికనే తెలంగాణలోనూ ఫాలో కావాలని, ఇక్కడ కూడా కాషాయ జెండాలు రెపరెపలాడించాలని ఆ పార్టీ భావిస్తోంది. మరి యూపీలో సక్సెసైన ప్లాన్‌... తెలంగాణలో వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.