జెట్ స్పీడుతో పయనించనున్న టీ-బిల్లు

 

రాష్ట్ర విభజనపై కేంద్రం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లుగా నటిస్తూనే, మరో పక్క తెలంగాణా బిల్లుని జెట్ స్పీడుతో పార్లమెంటుకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణా బిల్లుపై చర్చజరిపేందుకు వచ్చేనెల రెండు మూడు తేదీలలో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చునని తెలుస్తోంది.

 

స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న శాసనసభ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యి సభ నిర్వహణ గురించి చర్చించారు. మళ్ళీ ఈరోజు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశామయ్యి భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.

 

ఈ ప్రత్యేక సమావేశాలలో కేవలం రాష్ట్ర విభజన, తెలంగాణా బిల్లుపై తప్ప వేరే ఏ ఇతర అంశాలపై చర్చకు అనుమతించరు. ఒకవేళ అవసరమను కొంటే, స్పీకర్ ఈ సమావేశాలను మరొక్క రోజు మాత్రమే పొడిగించవచ్చును. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించమని రాష్ట్రపతే నేరుగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయబోతున్నందున ఇక శాసనసభని ప్రోరోగ్ చేయమంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకి అందిన లేఖను పట్టించుకొనవసరం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 

ఈ ప్రకారం చూస్తే ఈరోజు జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశమే తుది సమావేశమని భావించవచ్చును. వారు రేపు జరిగే కేంద్రమంత్రి వర్గం సమావేశానికి తమ తుది నివేదిక సమర్పించడం, అక్కడి నుండి తెలంగాణా బిల్లు జెట్ స్పీడుతో పయనిస్తూ అందరి ముద్రలు వేయించుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాలలోగానే డిల్లీ చేరుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.

 

ఇదే నిజమయితే, రాజ్యాంగ స్పూర్తికి, విధివిధానాలకు పూర్తి విరుద్దంగా తెలంగాణా బిల్లును ఆఘమేఘాలపై కదిలించడం దేనికంటే బహుశః వచ్చేనెల 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకేనని భావించాల్సి ఉంటుంది.

 

ఇది చాలా ఆహేతుకంగా ఉన్నపటికీ సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడిన మాటలు వింటే నిజమని నమ్మక తప్పదు. ”అమ్మ తలుచుకొంటే ఏదయినా సాధ్యమే! ఈ అంటోనీ కమిటీలు, కేంద్రమంత్రుల బృందాలు అంతా ఒట్టోట్టివే! ఎవరెన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకొన్నా అమ్మ నిర్ణయమే తుది నిర్ణయం. ఆమె మాటే వేదవాక్కుఅందరికీ,” అని అన్నారు.

 

సోనియాగాంధీ తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నారు గనుక, ఆ ప్రకారమే కాంగ్రెస్ లో అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. అవసరమయితే పరుగులు తీస్తాయి కూడా.