ముఖ్యమంత్రి తుది వరకు చేసే పోరు దేని కోసం

 

అమలాపురం యంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమను రాజీనామాలకు తొందర పడవద్దని, సమయం రాగానే అందరూ కలిసి ఒకేసారి రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొందామని చెప్పారని తెలిపారు. అంటే నేటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అంశంపై పావులు కదిపేందుకు సిద్దంగానే ఉన్నారని అర్ధం అవుతోంది.

 

కాంగ్రెస్ అధిష్టానం ఇంత ఖరాఖండిగా రాష్ట్ర విభజనపై వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి విభజనను అడ్డుకొనేందుకు తుదివరకు పోరాడాలని భావించడం చూస్తే, ఆయనకీ వేరే ఇతర కారణాలు, ఆలోచనలు కూడా ఉండి ఉండవచ్చును. ఆయన పదవిలో కొనసాగుతూ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి హోదాలో సీమాంద్రాకు కొత్తగా మేలు చేసిన దాఖలాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన కొత్తగా చేసిన ప్రయత్నం కూడా ఏమీ లేదు.

 

ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో రాజీనామా చేయడం వలన ప్రజలపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చుననే ఆలోచనతోనే, బహుశః ఆయన సరయిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. శాసనసభలోతెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన తరువాత దానిపై మీడియా సాక్షిగా వీరోచితంగా వాదనలు చేసి, బిల్లుని వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొన్నట్లయితే అది ప్రజలపై మరింత ప్రభావం చూపుతుందని ఆయన ఆలోచన కావచ్చును. తద్వారా ఆయన సీమాంధ్ర ప్రజలలో తన రేటింగ్ మరింత పెంచుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనమూ కనబడటం లేదు.

 

ఏమయినప్పటికీ, తెలంగాణా ఏర్పాటు తధ్యమని మాత్రం స్పష్టం అవుతోంది. అందువలన ఇంత వరకు సమైక్యాంధ్ర కోసం ‘తుదివరకు పోరాడిన’ ఈ కాంగ్రెస్ నేతలందరూ ఇక హైదరాబాద్, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు వగైరాల పంపకాలపై పోరాడుతామని ప్రజలకి చెప్పబోతున్నారు.