తెలంగాణా బంద్ కి వైకాపా మద్దతు..ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

 

రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇవ్వాళ్ళ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. అందులో పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. కానీ ఆ ప్రతిపక్షాలలో తెరాసకు రహస్య మిత్రుడు వైకాపా కూడా ఉండటమే ఆశ్చర్యకరమయిన విషయం. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వంతో చాలా కాలంగా పోరాడుతున్నాయి. కానీ వైకాపా ఇంతవరకు ఒక్కసారి కూడా రైతుల ఆత్మహత్యల గురించి బహిరంగంగా మాట్లాడలేదు.

 

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, అ బాధ తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పనిగట్టుకొని ఓదార్చుతున్న షర్మిల అదే నియోజక వర్గంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతన్నల కుటుంబాలను మాత్రం పరామర్శించడం లేదు. తెరాసకు ఇబ్బంది, ఆగ్రహం కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె వారిని పరామర్శించడం లేదని భావించక తప్పదు. అందుకే తెలంగాణాలో ప్రతిపక్షాలన్నీ ఈ సమస్యపై పోరాడుతున్నప్పటికీ వైకాపా నేతలు మౌనంగా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవలసి వచ్చింది. కానీ రేపు జరుగబోయే రాష్ట్ర బంద్ కి తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలంగాణా రాష్ట్ర వైకాపా అధ్యక్షుడు పి. శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. తమ పార్టీ కూడా రైతుల తరపున పోరాడుతుందని ఆయన తెలిపారు. రేపటి బంద్ ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

కానీ తెరాసకు రహస్య మిత్రపక్షంగా కొనసాగుతున్న వైకాపా కూడా రేపటి బంద్ లో పాల్గొంటే తెరాసకు ఆగ్రహం కలగదా? అంటే కలగదనే చెప్పవచ్చును. ఎందుకంటే రేపు ఎలాగూ ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్ర బంద్ చేస్తున్నాయి, కనుక దానికి వైకాపా మద్దతు ఇచ్చినంత మాత్రాన్న తెరాస ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం లేదు. అది నలుగురితో నారాయణ అయిపోతుంది. బహుశః ఇటువంటి ఆలోచనలను చూసే “గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం!” అనే మాట పుట్టుకొచ్చి ఉండాలి. వైకాపా నేతలు రైతుల సమస్యలపై ఎప్పుడూ నోరు విప్పకపోయినా ఈ బంద్ లో పాల్గొంటే రైతుల సమస్యలపై పోరాడుతున్నట్లు గొప్పగా చెప్పుకోవచ్చును.

 

ఈ బంద్ లో పాల్గొనడం ద్వారా వైకాపాకు మరో ప్రయోజనం కూడా ఉంటుంది. రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలలాగే తమ పార్టీ కూడా తెరాసను ప్రత్యర్ధిగా భావిస్తున్నట్లు చాటి చెప్పుకొన్నట్లవుతుంది. అయినా ఇప్పుడు కూడా దూరంగా ఉండిపోతే అందుకు కూడా తెదేపా నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే నలుగురితో నారాయణ అంటోంది వైకాపా.