తెలంగాణ అసెంబ్లీలో రోల్ మోడల్స్‌‌గా మారిన మంత్రి, ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ చాలా భిన్నమైన వాతారణం కనిపించింది వెల్‌లోకి దూసుకురావడం.... దూషణలు, నినాదాలు, గొడవలే కాదు.... అవసరమైతే క్షమాపణ చెప్పి... సభ హుందాతనాన్ని కాపాడతామని నిరూపించారు తెలంగాణ శాసనసభ సభ్యులు. మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలు తెలంగాణ శాసనసభ గౌరవం పెంచేవిధంగా వ్యవహరించారు. వెల్‌లోకి వచ్చినందుకు కిషన్‌రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తంచేయడంతో.... స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.... మోడీనుద్దేశించిన తాను చేసిన వ్యాఖ్యలను అంతే హుందాగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రవర్తన విషయంలో ఇద్దరూ రోల్ మోడల్‌లా వ్యవహరించారు.

 

ఇక ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యుడి నుంచే విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఏ ప్రాంతం నుంచైనా రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల చార్మినార్, గోల్కొండలను కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని తీవ్రస్థాయిలో అడిగారు. అయితే 48గంటల ముందుగా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ వివరణ ఇఛ్చారు. ముందుగా ఇన్ ఫర్మేషన్ ఇచ్చాకే రిజిస్టేషన్లు జరుగుతున్నాయన్నారు.

 

2016లో విద్యా పరిస్థితిపై వార్షిక నివేదిక విడుదల చేయాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి.... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళిత సీఎం హామీ ఎలాగూ పెండింగ్‌లో ఉంది కాబట్టి.... కడియం ముఖ్యమంత్రి కావాలంటూ వ్యాఖ్యానించారు. వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్‌తోపాటు అధికారపక్షం కూడా అభ్యంతరం వ్యక్తంచేసింది.