డిప్యూటీని టార్గెట్‌ చేసిన విపక్షాలు... నొచ్చుకున్న స్పీకర్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌‌రెడ్డిపై విపక్షాలు కన్నెర్ర చేశాయి. పదేపదే మైక్‌ కట్‌ చేస్తూ, ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తున్నారంటూ మూకుమ్మడి దాడికి దిగాయి. అధికారపక్షానికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలపై పక్షపాతం చూపిస్తున్నారంటూ విపక్ష నేతలు మండిపడ్డారు. కీలక అంశాలపై మాట్లాడేటప్పుడు ఏకపక్షంగా మైక్‌ కట్‌ చేస్తున్నారని జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ను పిలిచి మాట్లాడాలని శాసనసభా వ్యవహారాల మంత్రిని జానా కోరారు. ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే పదేపదే మైక్‌ కట్‌ చేస్తున్నారని, శాసనసభాపక్ష నేతలకు కూడా అవకాశమివ్వకపోతే ఎలా అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 

 

ప్రతిపక్షాల ఆరోపణలపై శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావ్‌ ఘాటుగా స్పందించారు. అధికారపక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరిస్తోందని, డిప్యూటీ స్పీకర్‌ అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారని, ప్రతిపక్షాలు ఇలా చైర్‌ను డిక్టేట్‌ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలంటే తమకు గౌరవం ఉందన్న హరీష్‌.... ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైక్‌ ఎన్నిసార్లు కట్‌ చేస్తున్నారో చూడండి అంటూ జానారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

 

ఛైర్‌ను డిక్టేట్‌ చేయొద్దని విపక్షాలకు స్పీకర్‌ సూచించారు. ఎవరిపైనా తమకు చిన్నచూపు లేదన్న స్పీకర్‌ మధుసూదనాచారి.... ప్రతిపక్షాలకు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయమే ఇస్తున్నామన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా సభ జరగడం లేదన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలు.... ఛైర్‌ను బాధకలిగించాయన్నారు.