తెలంగాణ అసెంబ్లీలో మంట పుట్టించిన కాంగ్రెస్‌ లీడర్లు

సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కింది. ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథపై అధికార, ప్రతిపక్షాలు ఘాటైన విమర్శలు చేసుకున్నాయి. జానారెడ్డి-హరీష్‌రావ్‌, కేటీఆర్‌-కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువర్గాల విమర్శలు ప్రతివిమర‌్శలతో సభ వాడివేడిగా సాగింది. రీ-డిజైనింగ్‌తో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని జానారెడ్డి..... ఎలాంటి అవినీతి జరగకుంటే డీపీఆర్‌లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా... విపక్షాలను నిందించడం తగదన్నారు. జానారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్‌రావ్‌.... రీ-ఇంజనీరింగ్‌ను తప్పబట్టొద్దని సూచించారు. కృష్ణా-గోదావరి జలాలను అధికంగా వినియోగించుకునేందుకే అత్యంత శాస్త్రీయంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

 

ఆ తర్వాత మిషన్‌ భగీరథపై వాడివేడి చర్చ జరిగింది. మిషన్‌ భగీరథలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.... హౌస్‌ కమిటీ వేస్తే అవినీతి భాగోతం నిరూపిస్తానన్నారు. మిషన్‌ భగీరథలో అక్రమాలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సవాల్‌ విసిరారు.కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ చరిత్రే అక్రమాల పుట్టన్న కేటీఆర్‌.... నిరాశా నిస్పృహలతోనే కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో కోమటిరెడ్డి-కేటీఆర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మిషన్‌ భగీరథలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్న కేటీఆర్‌.... హౌస్‌ కమిటీ వేయబోమంటూ తేల్చిచెప్పారు. కేటీఆర్‌ కామెంట్స్‌‌పై ఫైరైన జానారెడ్డి..... మిషన్‌ భగీరథలో ఎలాంటి అక్రమాలు జరగపోతే హౌస్‌ కమిటీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.