కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది ఘోరం!

 

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది నిజంగా ఘోరం, నేరం! తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేసేసి, అవసరమైతే డిస్మిస్ కూడా చేసేయాల్సినంత దారుణం. లేకపోతే ఏమిటండీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అసెంబ్లీలో కళ్ళకి, చెవులకి పని చెప్పి సైలెంట్‌గా కూర్చోవాలి. అధికార పార్టీ ఎలా పరిపాలించినా కిక్కురుమనకుండా పడి వుండాలి. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడమేంటసలు? పైగా బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం శ్రమపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తెలియజేయడమేంటి? తప్పుకదా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి తగిన శాస్తి చేయడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట.

 

అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. వాళ్ళ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన భలే నచ్చేసి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మిగిలిన కొద్దిమంది కూడా టీఆర్ఎస్ జీవన స్రవంతిలో కలసిపోయి ధన్యులైపోవాలి. అలా కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వుంది ఆందోళనలు చేయడం ఏమైనా పద్ధతిగా వుందా? పైగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గోలగోల చేయడం ఎంతమాత్రం బాగాలేదని టీఆర్ఎస్ నాయకులు ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఏంటీ? తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు చేసిన గోలతో పోల్చుకుంటే ఈ గోల ఏపాటిదని అంటున్నారా? అప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ మీద టీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరారని, మైకు లాగారని, ఎమ్మెల్యే జె.పి. మీద డ్రైవర్ చేత దాడి చేయించారని గుర్తు చేసుకోండని అంటున్నారా? అసలు మీ వాదనలో అర్థం వుందా? అప్పుడంటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏది చేసినా కరెక్ట్... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది తప్పున్నర తప్పు. అలాంటి తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు తగిన శిక్ష పడాల్సిందే.

 

అది సరేగానీ, తెలంగాణ విధాన మండలిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. అది డైరెక్టుగా వెళ్ళి ఛైర్మన్ గారి కంటిమీద తగిలింది. ఆ దెబ్బ చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కాబట్టి ఆ బాధని చాలాసేపు భరించారు. గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆయన ఆ బాధని భరిస్తూనే వున్నారు. ఆయన ఓర్పుకి జోహార్. ఆ తర్వాత ఆయన సీఎం గారి సలహా మేరకు కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. కంటి డాక్టర్లు ఆయన కంటికి డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు. గౌరవనీయులైన స్వామి గౌడ్ గారి కంటికి వున్న ఆ కట్టును చూసి తెలంగాణలో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. స్వామి గౌడ్ గారి కంటికి ఏమీ కాదని డాక్టర్లు భరోసా ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలి ఒక కన్ను పోతే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో! ఒక కంటితో ఆయన సమావేశం హాలు మొత్తాన్నీ ఒకేసారి చూడలేక చాలా ఇబ్బంది పడేవారు. అలా జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ రయ్యిమని దూసుకుని వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తగిన విధంగా శిక్షించాల్సిందే.