కాంతారావు భార్యకు 10 వేల పెన్షన్

 

సీనియర్ నటుడు దివంగత కాంతారావు భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు పది వేల రూపాయల ప్రత్యేక జీవితకాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నటుడిగా ఒక వెలుగు వెలిగిన కాంతారావు సినిమా నిర్మాతగా చేతులు కాల్చుకుని జీవిత చరమాంకంలో పేదరికాన్ని అనుభవించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తెలంగాణ (నల్లగొండ జిల్లా) ప్రాంతానికి చెందిన నటుడు కాంతారావు కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక అంశంగా పరిగణించి కాంతారావు భార్య ఎనభయ్యేళ్ళ హైమావతికి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.