TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రానున్న పది రోజులూ తెలంగాణ నిప్పులగుండమే!

Published on: Mon May 11, 2026 3:07PM

తెలంగాణలో గత రెండు రోజులుగా అడపాదడపా అక్కడక్కడ కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడినప్పటికీ.. మళ్లీ  మంగళవారం ( మే12)  నుంచీ ఎండలు ఠారెత్తించనున్నాయి.  మంగళవారం (మే 12) నుంచి ఈ నెల 22 వరకూ  అంటే పది రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత  గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ   నిప్పుల గుండంగా మారనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే అవకాశం  ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎండలు  46 డిగ్రీల వరకూ చేరవచ్చనీ, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు  చేరుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.  తెలంగాణలో ఈ హీట్ వేవ్ పది రోజుల పాటు ఉంటుందని హెచ్చరించింది.  మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని  అధికారులు చెబుతున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండగానే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కురిసిన వడగండ్ల వానకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న రాశులు తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడిసిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి నీళ్లు, ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు.