TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గచ్చిబౌలీ వద్ద తెలంగాణా హైకోర్టు?

Published on: Fri Mar 20, 2015 5:32PM

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేవరకు అలుపెరుగని పోరాటం సాగించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు, హైకోర్టు విభజనకు చకచకా పావులు కదుపుతున్నారు. కేంద్ర న్యాయ శాఖామంత్రి సదానంద గౌడ కూడా అందుకు సై అనడంతో ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ చేత అందుకు ఒక తీర్మానం చేయించారు. రాష్ట్ర న్యాయశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొందరు న్యాయవాదుల సంఘాల నాయకులను డిల్లీకి పంపించారు. అదేసమయంలో తెరాస యంపీలను కూడా సదానంద గౌడ వద్దకు పంపించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, గచ్చి బౌలీ వద్ద 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాల భవనం ఒకటి సిద్దంగా ఉందని తెలియజేసారు.

 

హైకోర్టు విభజనకు కేసీఆర్ చాలా వేగంగా పావులు కదుపుతున్నప్పటికీ, ఉభయ రాష్ట్రాలు ఈ విషయం గురించి చర్చించుకొని తన వద్దకు రమ్మని చెప్పిన సదానంద గౌడ సూచనను మాత్రం పట్టించుకోలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ ఆయన పట్టించుకాకపోయినా, న్యాయశాఖామంత్రిగా ఉన్న సదానంద గౌడకి మాత్రం తప్పదు కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు విభజన గురించి లేఖ వ్రాసి దాని అభిప్రాయం తెలుసుకొన్న తరువాత ముందుకు వెళ్తానని తనను కలిసిన రాష్ట్ర ప్రతినిధులకు చెప్పినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజనకు కేసీఆర్ ఇంతగా తొందరపడుతున్నప్పుడు, ఆయనే ఒకమెట్టుదిగి చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడి ఉండి ఉంటే ఆలస్యం జరుగకుండా నివారించగలిగేవారు కదా? తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండానే కోర్టు విభజన జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు అడ్డు చెపుతారు? కనుక కేంద్రప్రభుత్వం హైకోర్టు విభజన చేయాలనుకొంటే అందుకు చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చును.