మూడు నాలుగేళ్ళలో తెలంగాణలో విద్యుత్ స్వయం సమృద్ధి

 

సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి అన్నట్లుంది ఆంధ్ర, తెలంగాణాల కష్టాలు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెటు, వ్యవసాయ రుణ భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణా ప్రభుత్వానికి కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఎంత చురుకుగా విద్యుత్ ఉత్పత్తికి, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, కనీసం మరో మూడేళ్ళ వరకు తెలంగాణాకు విద్యుత్ కష్టాలు తప్పవని ముఖ్యమంత్రే స్వయంగా చెపుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. ప్రస్తుత్వం తెలంగాణా రాష్ట్రంలో రోజుకి 27.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. ఆంద్ర ప్రభుత్వం సహకరించి శ్రీశైలం ఎడమ కాలువ నుండి నీళ్ళు విడుదల చేస్తుండటంతో దిగువనున్న హైడల్ విద్యుత్ ప్రాజెక్టు నుండి దాదాపు 8 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనివలన తెలంగాణా రైతాంగానికి కొంతలో కొంత ఉపశమనం లభిస్తోంది.

 

అయినప్పటికీ వ్యవసాయానికి కనీసం ఏడూ గంటలసేపు విద్యుత్ సరఫరా చేయాలంటే పరిశ్రమలకు కోత పెట్టక తప్పేలా లేదు. ప్రస్తుతం వారానికి ఒక రోజు ఉన్న పవర్ హాలీడేను రెండు రోజులకి పెంచేందుకు తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణా రాష్ట్రంలో తొలి ప్రాధాన్యత వ్యవసాయానికే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, పరిశ్రమలకు విద్యుత్ కోతలు మరింత పెంచక తప్పేలా లేదు. దానివల్ల కొన్ని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే వాటిపై ఆఅధారపడిన కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అంతకంటే ఎక్కువ మందే రోడ్డున పడతారు. ఆహార ఉత్పత్తి పడిపోతుంది. దానివలన ధరలు పెరుగుతాయి. అందువలన తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయానికి రోజుకి కనీసం 7గంటలు నిరనత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయితే పరిశ్రమలకు కొత్త పెట్టాలని భావిస్తోంది.

 

తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం చేపడుతున్న అనేక చర్యలు ఫలించడానికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చని, అప్పటి నుండి క్రమంగా పరిస్థితి మెరుగవుతుందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఆయన కేంద్రంతో కూడా సామరస్యంగా వ్యవహరించ గలిగితే, కేంద్రం కూడా తెలంగాణా ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్దంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధనమేరకు కేంద్ర గ్రిడ్ నుండి ఇప్పటికే చాలా విద్యుత్ కేటాయించింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంతర విద్యుత్ సరఫరా పధకం పైలట్ ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకొంది. అక్టోబరు రెండు నుండి ఈ పధకం రాష్ట్రమంతటా అమలులోకి వస్తుంది.

 

నిజానికి ఆంధ్రా కంటే తెలంగాణా ప్రభుత్వానికే ఇటువంటి విద్యుత్ పధకాలు అత్యవసరమని చెప్పవచ్చును. కానీ, అటువంటివి ఆశించే ముందు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం చాలా అవసరం. మరొక రెండు మూడేళ్ళలో తెలంగాణా విద్యుత్ విషయంలో స్వయం సమృద్ధి చెందే అవకాశం ఉంది గనుక అంతవరకు కేంద్రంతో, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణా ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకోగలిగితే తెలంగాణకు విద్యుత్ కష్టాలు చాలా వరకు తీరవచ్చును.