ఆ గవర్నరు చేతికే ప్రసంగపాఠం

 

తెలంగాణా శాసనసభ సమావేశాలు జూన్9 నుండి నాలుగు లేదా ఐదు రోజులపాటు జరుగుతాయని తెలంగాణా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి టీ.హరీష్ రావు ఈరోజు ప్రకటించారు. ముందుగా జూన్9 ఉదయం 9గంటలకు రాజ్ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా కే.జానా రెడ్డి పదవీ ప్రమాణం చేస్తారని, 11గంటల నుండి తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవుతాయని తెలిపారు. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికయిన సభ్యుల పదవీ ప్రమాణ కార్యక్రమం ఉంటుందని, జూన్ 11న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని హరీష్ రావు తెలిపారు.

 

ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి సమావేశాలివే. అదేవిధంగా ఇంతకాలం తెలంగాణా ఉద్యమాలు చేసిన తెరాస ప్రభుత్వపగ్గాలు చేప్పట్టి అధికార పక్షంలో కూర్చోబోతుండగా, గత పదేళ్లుగా అధికార పార్టీ హోదాలో కూర్చొన్న కాంగ్రెస్, తెదేపాతో బాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చోబోతోంది.

 

ఇక మరో విశేషమేమిటంటే ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నపుడు ఆయన చేతిలో నుండి చాలా దౌర్జన్యంగా ఉపన్యాస ప్రతులను లాక్కొని చించివేసి గవర్నరును ఘోరంగా అవమానించిన తెరాస నేతలు, ఇప్పుడు అదే గవర్నర్ నరసింహన్ చేతిలో తమ ప్రభుత్వం గురించి చెప్పవలసిన నాలుగు మంచి ముక్కలున్న ప్రసంగపాఠం పెట్టబోతున్నారు. ఒకవేళ తెదేపా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేచి అభ్యంతరాలు చెపితే, ఈసారి తెరాస నేతలు వారికి సర్దిచెప్పి కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఇంతవరకు అధికార పార్టీని శాసనసభలో నిలదీస్తూ వచ్చిన తెరాస, ఇప్పుడు తమను ప్రతిపక్షాలు నిలదీస్తుంటే, వారికి సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. ఓం ప్రధమంగా వ్యవసాయ రుణమాఫీలపైనే అధికార, ప్రతిపక్షాల యుద్ధం మొదలవుతుంది.