డిల్లీకి చేరిన విభజన రాజకీయం

 

రాష్ట్ర విభజన బిల్లు ఈరోజు డిల్లీ చేరుకోబోతోంది. దానికంటే ముందు, తరువాత రాష్ట్ర రాజకీయ నేతలందరూ కూడా డిల్లీలో దిగి విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా లాబీయింగ్ చేస్తున్నారు. అందరి కంటే ముందు డిల్లీలో వాలిన కేసిఆర్ ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లను కలిసి బిల్లుకి మద్దతు ఇచ్చేందుకు ఒప్పించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే తిరిగి హైదరాబాద్ వస్తానని ఆయన ప్రతిజ్ఞ కూడా చేసారు.

 

చంద్రబాబు నాయుడు తన ఆంధ్ర, తెలంగాణా యంపీ, యంయల్యేలను వెంటబెట్టుకొని కొద్ది సేపటి క్రితమే డిల్లీకి బయలుదేరారు. ఆయన ఇరుప్రాంతల నేతలను వెంటబెట్టుకొని రాష్ట్రపతిని కలిసి రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ విభజన ప్రక్రియను ఆపివేయాలని కోరనున్నారు. తెదేపాతో ఎన్నికల పొత్తు పెట్టుకొందామని భావిస్తున్న బీజేపీ కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగినట్లయితే చూస్తూ ఊరుకోమని, వారి హక్కులను కాపాడుతూ తాము బిల్లులో కొన్ని సవరణలు సూచించబోతున్నామని, కాంగ్రెస్ అధిష్టానం వాటిని ఆమోదిస్తేనే బిల్లుకి తాము మద్దతు ఇస్తామని ఈమధ్యనే ప్రకటించింది.

 

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష చేప్పట్టి, ఆ తరువాత సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యంయల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలిసి శాసనసభ తిరస్కరించిన బిల్లుని పార్లమెంటుకి పంపవద్దని కోరనున్నారు. అదేవిధంగా ఏపీయన్జీవో ఉద్యోగ సంఘ నాయకుడు అశోక్ బాబు కూడా ఉద్యోగ సంఘ నాయకులను వెంటబెట్టుకొని డిల్లీలో ధర్నా చేయనున్నారు.

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ యంపీలను, యంయల్యేలను వెంటబెట్టుకొని నేడో రేపో రాష్ట్రపతిని కలిసి బిల్లుని తిరస్కరించమని కోరనున్నారు. రాష్ట్రం నుండి అన్ని రాజకీయ పార్టీల నేతలు డిల్లీలో ఇతర పార్టీ నేతలను కలిసి బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా ఓటువేయమని కోరుతుండటంతో వారు కూడా రెండుగా చీలిపోయారు.

 

మొదటి నుండి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీపీయం నేతలు తాము పార్లమెంటులో బిల్లుని వ్యతిరేఖిస్తామని స్పష్టం చేసారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేఖిస్తున్న సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, అతని కుమారుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ తెలంగాణా బిల్లుని తాము వ్యతిరేఖిస్తామని ప్రకటించారు.