ప్రజా శ్రేయస్సు.

 

 

.......Vijaykumar ponnada

 

హట్టాతుగా, ఈ మధ్య ప్రజలందరు మంత్రులను, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని కనిపించినవార్ని కనిపించినట్టుగా, కనిపించనివారిని వెదికి పట్టుకుని, వున్నఫళంగా బరబరా లాక్కెళ్ళిపోయి, చేతికో పూలగుచ్చం ఇచ్చి, మెడలో ఓ దండవేసి, చుట్టూ ఓ శాలువాలాంటిది కప్పేసి, గుర్తుగా ఓ పనికిమాలిన ఉపయోగంలేని ఓ రుబ్బురోలు పత్రం బహుకరించి మరీ సన్మానాలు చేసేస్తున్నారు. ఈ హటాత్తు పరిణామానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వోద్యోగులు ఎక్కడివారక్కడే ఏకబిగిన హడలిపోయి ఆ తరువాత బెబేలిత్తిపోయి పిదప జాడుసుకుని ఇక ఏమి చెయ్యాలో తోచక ఉద్యోగాలకి శెలవులు పెట్టి ఎటొ పారిపోయారు. శెలవులు పెట్టలేని అభాగ్యులు ముఖానికి ముసుగులేసుకుని, మారువేషాలేసుకుని దొడ్డి దారెంబట ఆఫిసు కెళ్ళి బెంచికింద పడుకునో, కుర్చీకింద కూర్చునో, బిక్కుబిక్కుమంటు భయపడిచస్తూ పనిచేసుకుంటున్నారు.


అప్పుడెప్పుడో తీవ్రవాదులు పార్లమెంటుని ముట్టడించినప్పుడు కూడా ఇంత బెంబేలెత్తిపోలేదు. మంత్రులుకాని, ఎమ్మెల్యేలుకాని, ప్రభుత్వ అధికారులుకాని వాళ్ళ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. దుకాణాల ప్రారంబోత్సవానికి, సదస్సులకి, మీట్టింగులకి వెళ్ళటం మానేసి, ఇంట్లో మంచం కింద దాక్కుంటూ, ఎవరొచ్చినా లేరని చెప్పి పంపించేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం యదావిధిగా నాల్రోజుల తరువాత ప్రభుత్వం మేల్కొని, ఇలాంటి పరిణామాలకి దారితీసిన పరిస్తితులని విశ్లేషించటానికి, ఓ కమిటీని వేసింది. వారు ప్రజల్లో వచ్చిన ఈ అనూహ్యమయిన మార్పుకి కారణాలు వారినే అడిగి తెలుసుకోవటం మొదలెట్టారు.



'భలేవారు సార్, ప్రభుత్వం మాకు అందించే సేవలు ఇంతా అంతా కాదు కదా. వారు మా బాగోగులు చూస్తూంటే, వారిని కానీసం పిలిచి గౌరవించుకోవటం మా కర్తవ్యం కాదంటారా? అన్ని తెల్సే అడుగుతారు.' అని వెళ్ళిపోయాడు. తలగోక్కున్న్నారు కమిటీవాళ్ళు. మరొకడి దగ్గరకి వెళ్ళారు. 'అసలు ఇది వారికి సన్మానం కాదు. మాకు మేమే చేసుకునే సన్మానం. వారు మాకు చేసే సేవలకి, వారు మాకొసం అమలు చెసే పధకాలకి, వేయి సన్మానాలు చేసినా తీరదు. మహానుభావులు.' అని, అటుగా దండలు పట్టుకుని స్థానిక ఎమ్మెల్యేల కోసం వెదుకుతున్న ఓ గుంపుని చూసి 'ఒరేయ్, మా ఇంటి పక్కన వేరుసనక్కాయలు అమ్ముకునేవాడిలా ఒకడు తచ్చాడుతూ తిరుగుతున్నాడు. వాడు మారు వేషంలో వున్న మన ఎమ్మెల్యే అని నాకు అనుమానం ' అన్నాడు. అంతే అందరు అటువైపు పరిగెత్తారు. అలా పరిగెడుతున్న ఒకడిని ఆపి, 'బాబూ నీకు పుణ్యం వుంటుంది. అసలు ఈ సన్మానాల ప్రహశనానికి కారణం చెప్పవా, ప్లీజ్ ' అని వాడి కాళ్ళు పట్టుకున్నత పని చేసారు. వాడు తన చేతిలో దండ పక్కన పెట్టి చెప్పడం మొదలెట్టాడు.



'మన ప్రభుత్వం మనల్ని ఎంత బాగా చూసుకుంటోదో మీకు తెలియదా?' అడిగాడు. కమిటీ వాళ్ళు తెల్లముఖం వేసారు. వాళ్ళ తెల్లముఖం చూసి అతగాడు 'సర్లెండి నేనే చెబుతాను ' అని 'ఆకలేసినప్పుడు అన్నం ఎవరయినా పెట్టి ఆకలి తీరుస్తారు, కానీ ఆకలిపుట్టించి మరీ ఆకలి ఎవరయినా తీరుస్తారా? అలాగే, రోగం వచ్చినప్పుడు మందులు ఎవరయినా ఇచ్చి రొగం తగ్గిస్తారు, కానీ రొగాలు తెప్పించి మరీ రోగాలు ఎవరయినా తగిస్తారా?' అని అందరిని చూసాడు. తెల్లముఖాలేసుకుని చూస్తున్న వారు ఇంకా అలానే తెల్లబోయి చూడ్డం చూసి ' ఏంటీ? ఇంకా అర్ధంకాలేదా? మందు తాగనోడు ఎలాను మనాల్సిన పన్లేదు, కానీ వాడికి మందు తాగించి, మానిపించడం ఎవరయినా చేస్తారా?' అనడిగి, ఆ తెల్లముఖాలని చూసి 'మన ప్రభుత్వం చేస్తుంది.'అన్నాడు.



'మీరు మరీ వాజమ్మల్లా వున్నారు. గోడకొట్టిన సున్నంలా అలా తెల్లబోయి చూడ్డం తప్ప, మీకు ప్రభుత్వ విధానాల గురించి అస్సలు తెలిసినట్టు లేదు. ప్రజలని బాగు చేయడం అంటే ఏంటో మీకు బొత్తిగా అవగాహన లేదు. ఇప్పుడు ప్రజలని బాగు చేయాలి అంటే, వాళ్ళు చెడ్డవాళ్ళయినా అయ్యిండాలి లెదా చెడిపోవాలి? ఆనాడు వాల్మీకి వచ్చేపోయే వాళ్ళందరినీ తెగ బాది, దోచుకునేవాడు. అలాంటి చెడ్డవాడిని ఋషులు, ఆతరువాత భ్రహ్మా అతన్ని మంచివాడుగా మార్చారు. రామాయణం రచించేలా చేసారు. ఒకవేళ వాల్మీకి చెడ్డవాడు కాకపోతే, అతన్ని మంచివాడుగా మర్చి, రామయణం రచించేట్టుగా చేసే అవకాశం వుండేదా? అదే తర్కాన్ని ఇక్కడా వుపయోగించండి. ప్రజలని పాడు చేసి, వాళ్ళని మంచి వాళ్ళుగా మర్చడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. రూపాయికి బియ్యం ఇస్తున్నారు. అమ్మ హస్తం ద్వారా బోల్డు సరుకులు 'చీపుగా ' ఇచ్చేస్తున్నారు. వీటికి డబ్బులు తక్కువే, కానీ వచ్చే జబ్బులే ఎక్కువ. మరి ఆ రోగాలిని ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఇచ్చే మందులతో తగ్గించుకుంటాము. ఇలా జబ్బుల మందులకయ్యే ఖర్చు ఆదా చేసిన డబ్బుతో, మందు కొనుక్కుంటాము. ఇదివరకు మందు కొట్టేందుకు బెల్టు షాపుల్లోను, బూటు షాపుల్లోను జాగా లేక చాటుమాటుగా కొట్టే వాళ్ళం. ఈప్పుడు ప్రభుత్వం మందు కొన్న దుకాణం లోనే మందుకొట్టే సదుపాయం కలిపించి మమ్మలిని ఆదుకుంది. కాపోతే రోడ్డు మీదా వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా తాగి మేము పొర్పాటున రోడ్డు మీద తందన్నాలాడితే, ప్రభుత్వం వూరుకోదుకదండి. వెంటనే మమ్మలిని తీసుకెళ్ళి నివారణ కేంద్రానికి పంపిస్తుంది. అలా చెడ్డ వాళ్ళమయిపోయిన మమ్మాలిని బాగు చేసి మళ్ళి మందు షాపు ముందు నిలబెట్టి చేతులు దులుపుకుని వెళ్ళి పోతుంది. మేము అప్పుడు వాల్మీకిలా మంచోళ్ళమయ్యిపోతామన్నమాట. ఇన్ని వసతులు సౌకర్యాలు కలిపించిన ప్రభుత్వానికి మా విశ్వాసాన్ని తెలియచేయటానికే, ఇలా మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని పట్టుకుని సన్మానిస్తున్నము. తప్పా, చెప్పండి.' అన్నాడు. కమిటీవాళ్ళు అదేదో ప్రకటనలో వాడిలా అవాక్కయ్యిపోయారు. వెంటనే తేరుకుని 'మీరు చేస్తున్నది చాలా మంచిపని. మంచి ఎవరు చేసినా వారిని ప్రోశ్చహించవలసినదే. మా ఇంటి ఎదురుగా గిన్నెలకి మాట్లు వేసేవాడిలా మారు వేషంలో తిరుగుతున్న ఓ ప్రభుత్వ వుధ్యోగి వున్నాడు. రండి ' అన్నాడు ఓ కమిటీ సభ్యుడు. 'ఒరేయ్, ఇంకొకడు దొరికాడురోయ్.' అన్నాడు. అంతా అటు పరిగెత్తారు.