తెలంగాణాలో గెలిచి ఓడిన కాంగ్రెస్ పార్టీ

 

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ప్రకటనతో తెరాస, తెదేపాలపై పైచేయి సాధించినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ సదవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణా ప్రకటన చేసి కేసీఆర్ ను, తెరాసను పూర్తిగా దెబ్బతీయలనుకొన్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం కాస్తా టీ-కాంగ్రెస్ నేతల ఉదాసీనతతో బెడిసికొట్టింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన ప్రకటన చేసిన తరువాత వారెవరూ ఆ ఖ్యాతిని దక్కించుకొనే ప్రయత్నాలేవీ చేయకపోగా, ఇంకా ఏర్పడని తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి పదవికోసం అంతర్యుద్దంలో మునిగిపోయారు. వారి నిర్లిప్తతకు తోడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర ప్రాంతాన్ని దాదాపు స్తంభింపజేసారు.

 

అయినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలలోఎటువంటి ప్రతిస్పందన కనబడకపోవడంతో, అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంటూ కేసీఆర్ చకచకా పావులు కదుపుతూ తెలంగాణాలో తానే అసలయిన హీరోనని నిరూపించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ చురుకుగా కదిలి తెలంగాణా అంశాన్నిమళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులను తనకనుకూలంగా మలచుకొని ముందుకు సాగుతున్నాడు.

 

రాజధాని హైదరాబాద్ ను పంచుకొనే విషయంలో, ఆంద్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆతనిని తెలంగాణా ప్రజల హీరోగా నిలబెడితే, హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తూ మాట్లాడిన టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా విలన్లుగా మిగిలిపోయారు. నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంలో సరిగ్గానే ప్రతిస్పందించినపటికీ, అది తెలంగాణావాదానికి వ్యతిరేఖంగా ఉండటంతో కేసీఆర్ దే పైచేయి అయ్యింది.

 

ఇంతకాలం తెలంగాణా ఈయకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని అధిష్టానాన్ని పదేపదే హెచ్చరించిన టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పూర్తి ఆధిక్యత సాధించగలదని నిబ్బరంగా చెప్పలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో ఏ ఒక్కరికి తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తి పట్టు లేకపోవడం, ఏ ఒక్కరికి అందరినీ కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు లేకపోవడమే. అయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎవరికివారు తామే ప్రధాన నేతగా భావించుకొంటూ, మిగిలినవారిని తమకు పోటీదారులుగా భావించడం విశేషం.

 

తాజా సర్వేల ప్రకారం ఈరోజు ఎన్నికలు జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ కంటే తెరాసకే ఆధిక్యత ఉంటుందని తేలింది. ఈ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నపటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని తెలంగాణా ఏర్పాటు చేస్తున్నపటికీ అది ఆ పార్టీకి లాభం చేకూర్చకపోగా రెండు ప్రాంతాలలో కూడా నష్టం కలిగిస్తోంది. అందుకు ఆ పార్టీ నేతలనే నిందించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేల్కొనకపోతే తెరాసను విలీనం చేసుకోవడం సంగతి దేవుడెరుగు, ఆ పార్టీ రెండు ప్రాంతాలలో కనబడకుండా పోయే ప్రమాదం ఉంది.