వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా అంటూ

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటాపాటలు, కోలాటాలు, ఎక్కడికక్కడి నుంచో వచ్చిన అక్కాచెల్లెళ్ల సందడితో తెలంగాణ పరవశించింది.  తొమ్మిది రోజుల పాటు నీరాజనాలందుకున్న శివుడి ముద్దుల గుమ్మకు..

నిద్రపో గౌరమ్మ... నిద్రపోవమ్మా...

నిద్రకు నూరేండ్లు.... నీకు వెయ్యేండ్లు...

నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు... 

వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా అంటూ 

వీడ్కోలు పలికింది తెలంగాణ. మహాలయ అమావాస్య నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద బతుకమ్మ నమూనాలను తీర్చిదిద్ది పండుగను మరింత శోభాయమానంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఎక్కడ చూసినా పూలవనాలను తలపించింది. ఎనిమిది రోజుల పాటు సాగిన వేడుక అంతా ఒక ఎత్తయితే తొమ్మిదోరోజు, అష్టమినాడు జరిగే సద్దుల బతుకమ్మ సంబరాలు ఒక ఎత్తు.

 

రాజధాని సహా రాష్ట్రమంతటా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బంతి, తంగేడు, గునుగు, కట్లాయి, పట్టుకుచ్చు, చామంతి, గుమ్మడి పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ మహిళలు తండోపతండాలుగా కదిలివచ్చారు. ఉయ్యాల, చందమామ, కోలాటాల పాటలతో ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌లు కోలాహలంగా మారిపోయాయి. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పదిహేను రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. రంగురంగుల విద్యుదీపాల నడుమ ట్యాంక్‌బండ్ కొత్త శోభను సంతరించుకుంది. సాగరం మధ్య నుంచి తారాజువ్వల్లా ఆకాశానికి దూసుకెళ్లిన బాణాసంచా హుషారునింపింది.