అమిత్‌షా సైలెంట్‌ స్కెచ్‌... తెలంగాణ బీజేపీలో కలకలం...

 

తెలంగాణ బీజేపీ నేతలకు ఇప్పుడు అమిత్‌షా భయం పట్టుకుంది. తొలకరి వర్షాలు పడి వెదర్ కూల్ గా మారినా.... తెలంగాణ బీజేపీ నేతలకు చెమటలు పట్టేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎంత చెట్టుకు అంత గాలి అనుకుంటూ కమలం ఒడిలో కాలం గడిపేసిన రాష్ట్ర లీడర్లకు అమిత్‌షా చుక్కలు చూపెడుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్‌షా... పార్టీని పునాదుల నుంచి ప్రక్షాళన చేయాలని డిసైనట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర నేతల పనితీరుపై అమిత్‌షా సర్వేలు నిర్వహిస్తున్నారని, ఫలితాల ఆధారంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తారని చెప్పుకుంటున్నారు. 

 

జనంలో బలమున్న నేతలకు పెద్దపీట వేసి... షో పుటప్ లీడర్లను ఏరిపారేయాలని అమిత్ షా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో అసలు కమల బలం ఎంత? ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి..ఏ నేత సత్తా ఎంతన్నది తేల్చేయడానికి సొంతంగా సర్వేలు జరిపిస్తున్నారు. దాంతో రాష్ట్ర నేతలకు చెమటలు పడుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపి నివేదికలు తెప్పించుకుంటుండంతో ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఎవరు పోటీ చేశారు? వాళ్లకి వచ్చిన ఓట్లెన్ని? వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్ధి అయితే బెటర్ ఛాయిస్ అవుతుందన్న దిశగా అమిత్ షా సర్వే సాగుతోంది. ఈ సీక్రెట్ సర్వేలతో రాష్ట్ర స్థాయి, లోకల్‌ లీడర్ల గుండెల్లో గుబులు రేగుతోంది. ప్రస్తుతం పోటీ చేయాలనుకున్న వారితో పాటూ సెకండ్ కేడర్ లో ఉన్న వారి పేర్లు కూడా సర్వేలోప్రస్తావిస్తుండడంతో తమకు సీటు ఉంటుందా...లేదా అనే అనుమానం నేతలను పట్టి పీడిస్తోంది. జీవితాంతం తమకు బీజేపీలో టిక్కెట్టు ఖాయమనుకున్న నేతలకు సైతం ఇప్పుడు గద్దె కదిలే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. 

 

తెలంగాణ బీజేపీకి తానే కీలకం... తాను లేకపోతే తెలంగాణలో పార్టీ మనుగడే లేదనుకునే నేతలకు కూడా అమిత్‌షా ముచ్చెమటలు పట్టిస్తున్నారట. సర్వేల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తే... ఎవరైనా ఒకటేనన్న ధోరణితో కమల దళపతి ఉండటంతో ఈసారి తమకు టికెట్‌ వస్తుందో లేదోనన్న టెన్షన్‌ పట్టుకుందట. గతంలో మూడుసార్లు పోటీచేసి తక్కువ ఓట్లు తెచ్చుకున్నవారిని కూడా పక్కనపెట్టనున్నారు. ఇలా మూడుసార్లు వరుసగా ఓడిపోయినవారి స్థానాల్లో సెకండ్‌ కేడర్‌ లీడర్లకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అమిత్‌షా సర్వేల గురించి తెలుసుకుని ద్వితీయ శ్రేణి నేతల్లో జోష్‌ పెరిగిందని, తమకూ మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పుకుంటున్నారు. వడపోత కారణంగా పార్టీ బాగుపడుతుందని, తమకు కూడా అవకాశాలు వస్తాయని సెకండ్‌ గ్రేడ్‌ లీడర్లు భావిస్తున్నారు. అయితే అమిత్‌షా సర్వేల ఉద్దేశం బలమైన అభ్యర్ధిని గుర్తించడం... ఒకవేళ మరో పార్టీ నేత బలంగా ఉంటే... అతడ్ని పార్టీలోకి రప్పించడమే లక్ష్యమంటున్నారు. మరి అమిత్‌షా స్కెచ్‌ ఎవరికి ఎర్త్‌ పెడుతుందో? ఎవరిని అందలం ఎక్కిస్తుందో చూడాలి.