అన్నీ నీటి మీద రాతలేనా?

 

తెలంగాణా రాష్ట్రం ఇస్తే తెరాసను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోనియాగాంధీకి హామీ ఇచ్చారు. కానీ హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీకే ఆయన హ్యండిచ్చారు. చివరికి తెలంగాణా ఇచ్చిన ఖ్యాతి కూడా ఆమెకు దక్కకుండా చేసారు. అంతే కాదు తెలంగాణా ఇస్తే బొంత పురుగునయినా ముద్దాడేందుకు సిద్దమని చెప్పిన కేసీఆర్, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మట్టి కరిపించారు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ధాటికి ఎదురు నిలవలేకపోవడం విచిత్రం.

 

తెలంగాణా ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి తన ఉద్యమానికి దళితుల మద్దతు పొందిన కేసీఆర్, కుంటి సాకులతో ఆ హామీని తీసి పక్కన పడేసి తనే స్వయంగా ముఖ్యమంత్రి సింహాసనంలో సెటిల్ అయిపోయారు.

 

తెలంగాణా ఉద్యమంలో దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేసుకొన్నారని, తాము అధికారంలోకి రాగానే వారందరి కుటుంబాలను అదుకొంటామని చెప్పిన ఆయన, అధికారం చేప్పట్టిన తరువాత కేవలం 459మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబాలకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించారు. అంటే అప్పుడు ఆయన చెప్పిన లెక్కలు ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు చెప్పిన తప్పుడు లెక్కలా లేకపోతే మిగిలిన అమరవీరులను గుర్తించడానికి ఆయన ప్రభుత్వం సిద్దపడటం లేదా? అనేది ఆయనే చెప్పాలి.

 

అటువంటప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే ప్రశ్నకు పాపం ఆయనే జవాబు చెప్పుకొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తనను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోదనే విషయం ఉద్యమ సమయంలోనే తనకు తెలుసునని, తన భవిష్యత్ ఏమిటో తనకు అప్పుడే అర్ధమయిందని ఆయన చెప్పడం గమనిస్తే, తెరాస పార్టీ, తెలంగాణా ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఏపాటి విలువిస్తున్నారో అర్ధమవుతుంది.

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడటమే తరువాయి రాష్ట్రం నలుమూలలా నాలుగు స్థంభాలు నాటేసి విద్యుత్ సంక్షోభాన్ని తుడిచి పెట్టేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని తాపీగా చెపుతున్నారు. ఆగినట్లయితే కంటి రెప్ప మూసేంత సేపు కూడా విద్యుత్ పోకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తానని మళ్ళీ మరో కొత్త ప్రామిస్ చేస్తున్నారు. అయితే అందుకు ఆయన గట్టిగా ఏమయినా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అటువంటిదేమీ కనబడటం లేదు. అంటే ఈ ప్రామిస్ కూడా ఆయన మిస్ అయ్యే అవకాశాలే ఉన్నట్లు కనబడుతున్నాయి.

 

ఇక చైనా పాకిస్తాన్ దేశాలతో నదులను పంచుకోగా లేనిదీ ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదీ జలాలను, విద్యుత్ ని పంచుకోలేవా? అని విభజనను వ్యతిరేకించిన సమైక్యవాదులను గట్టిగా నిలదీసిన కేసీఆర్, ఇప్పుడు సుప్రీం కోర్టులకి వెళుతున్నారు.

 

తెలుగు ప్రజలు రాష్ట్రాలవారిగా రెండుగా విడిపోయినా అన్నదమ్ములలాగే కలిసిమెలిసి ఉండగలరు అని చెప్పిన ఆయనే మీ విద్యార్ధులు వేరు మా విద్యార్ధులు వేరు అంటూ ఫాస్ట్ పధకం తీసుకువచ్చి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొంటున్నారు. కనీసం ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇక నీళ్ళు, విద్యుత్ పంచుకోవడం సరేసరి.

 

ఇరుగుపొరుగు రాష్ట్రాలు, పార్టీల సంగతి పక్కన బెట్టవచ్చును. కానీ ఇంతకాలం ఆయనతో కలిసి తెలంగాణా కోసం ఉద్యమాలు చేసిన స్వంత పార్టీ నేతలని, ఉద్యమనేతలని కూడా ఆయన పక్కనబెట్టి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమంటే “ఇప్పుడు మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకొన్నాము కదా అందుకే ఆ పాత రూల్స్ వర్తించవని” తెగేసి చెప్పగలగడం కూడా గొప్పే.

 

ఈవిధంగా చెప్పిన మాటలను, చేసిన బాసలను, అండగా నిలిచినా వారినీ అందరినీ పక్కన పడేస్తూ, మళ్ళీ సరికొత్త హామీలు చేస్తూ, సరికొత్తవారితో జత కడుతూ కేసీఆర్ గాలిమేడలు (ఆకాశ హర్మ్యాలు) కడుతూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రయత్నంలో తెలంగాణా ప్రజలకు రంగురంగుల కలల ప్రపంచం చూపిస్తున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తుంటే తన, తన పార్టీ, ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బ తిట్టుందనే సంగతి మరి ఆయన గ్రహించారో లేదో తెలియదు కానీ విశ్వసనీయతకు మారు పేరని చెప్పుకొనే ఆంధ్రా పార్టీ ఇప్పుడు తెలంగాణాలోకి అడుగుపెడుతుంటే, మౌనం వహించడం గమనిస్తే మున్ముందు ఆ రెండు పార్టీలు జత కడతాయేమోనని అనుమానించవలసి వస్తోంది.

 

కేసీఆర్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళినప్పటికీ, ఎవరిని చంక నెక్కించుకొని, ఎవరిని పక్కనపడేసి నప్పటికీ, మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో కోటి రతనాల వీణ తెలంగాణాని బంగారి తెలంగాణాగా మార్చి చూపగలిగితే పరువలేదు. లేకుంటే ఆయనపై నమ్మకం పెట్టుకొన్నందుకు తెలంగాణా ప్రజలే ఎక్కువ బాధ పడతారు. ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో తెలంగాణా అభివృద్ధి చెందలేదని బాధ పడినవారు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ తమ జీవితాలలో ఎటువంటి మార్పు కనబడకపోతే నిరాశ చెందడం తధ్యం. అప్పుడు కేసీఆర్ ఏ సెంటిమెంటు ప్రయోగించినా ఫలితం ఉండకపోవచ్చును.