తెదేపాను దెబ్బ తీయడానికే సభలో తీర్మానమా?

 

విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, అందరూ కలిసి తెలుగు తల్లిని బలిపీఠం మీదకు ఎక్కిస్తున్నారని, ఆమె మెడపై ఇప్పుడు విభజన కత్తి వ్రేలాడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికంతటికి ప్రధాన కారణం తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఈయడమేనని ఆయన ఆరోపిస్తున్నారు. త్వరలో శాసనసభలో తెలంగాణాపై తీర్మానం పెట్టినప్పుడు తెదేపా గనుక, తెలంగాణా తీర్మానానికి వ్యతిరేఖంగా ఓటువేసి ఓడిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చునని ఆయన అన్నారు. ఒకవేళ అప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతే తానూ రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.

 

ఆయన మాటలు వింటే, రాష్ట్ర విభజన పట్ల ఆయన చాల ఆవేదన చెందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, నిజానికి ఆ బాధకంటే తెదేపాను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంది. అందుకే ఆయన శాసనసభలో తెలంగాణకు వ్యతిరేఖంగా ఓటేయమని తెదేపాను కోరుతున్నారు. తద్వారా, తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమో, అనుకూలమో చెప్పక తప్పనిపరిస్థితి కల్పిస్తే, దానిని బట్టి ఆ పార్టీని అటు తెలంగాణాలో, ఇటు సీమంద్రాలో పూర్తిగా దెబ్బ తీయవచ్చుననే దురాలోచన ఉంది. ఆ ఆలోచనతోనే మొన్న దిగ్విజయ్ సింగ్ కూడా సభలో తీర్మానం పెట్టబోతునట్లు తెలిపారు.

 

అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తెలంగాణా ఇవ్వడానికి సిద్దపడుతూనే, చివరి నిమిషం వరకు కూడా ఇదే అంశంతో తన ప్రత్యర్దులను ఏవిధంగా దెబ్బ తీయాలనే ఆలోచనలు చేస్తోందని అర్ధం అవుతోంది. ఇప్పటికే, తెలంగాణా సెంటిమెంటుని తెలివిగా హైజాక్ చేసి, తెరాసను దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే పాయింటుతో తెదేపాను రెండు ప్రాంతాలలో కూడా దెబ్బతీయాలని వ్యూహం పన్నుతోంది.

 

ఇంతవరకు వచ్చిన తరువాత, ఇప్పుడు తెదేపా తెలంగాణకు అనుకూలమని చెప్పినా ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే, తామే తెలంగాణా ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొని దాని పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయకమానరు. ఇక, సభలో తెదేపా తెలంగాణాకు అనుకూలమని చెపితే, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి, సీమంద్రాలో ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది.

 

తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ కేవలం ఈ భయంతోనే ఆ పార్టీ ఇంతవరకు తెలంగాణపై తన స్పష్టమయిన వైఖరి ప్రకటించలేకపోతోంది. తెదేపా యొక్క ఈ బలహీనతనే అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే మొన్నదిగ్విజయ్ సింగ్, నిన్నలగడపాటి వంటి వారు సభలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. రేపు మరికొందరు వారికి తోడయినా ఆశ్చర్యం లేదు.

 

ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలతో డబుల్ గేం ఆడుతోందని చెప్పవచ్చును. అక్కడ టీ-కాంగ్రెస్ నేతలు తామే తెలంగాణా సాధించామని చెప్పుకొని ప్రయోజనం పొందబోతుంటే, ఇక్కడ లగడపాటి, శైలజానాథ్ వంటి వారు తాము చివరి వరకు కూడా రాష్ట్ర విభజన జరగకుండా యధాశక్తిన ప్రయత్నించామని, కానీ, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని, నెపం తెదేపా మీదకు నెట్టివేసి సీమంద్రాలో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ దానివల్ల కలిగే ప్రయోజనాలను మాత్రం కాంగ్రెస్ పుచ్చుకొని, దుష్పరిణామాలు తెదేపాకు అంటగట్టే ప్రయతనం చేస్తోంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దురుదేశ్యాలు లేకపోతే, ‘శాసనసభ తీర్మానం తాము పట్టించుకోవలసిన అవసరం లేదని’ దిగ్విజయ్ సింగే స్వయంగా చెప్పినపుడు, ఇక శాసనసభలో తీర్మానం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం తెదేపాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వేస్తున్న ఎత్తుగడే తప్ప మరొకటి కాదు.